నిన్నమొన్నటి వరకూ.. పెళ్లికూతుర్ని చేయడంతోనో, పెళ్లికొడుకును చేయడంతోనో వివాహ వేడుక మొదలయ్యేది. కానీ ఇప్పుడు మెహిందీతోనే ప్రారంభం అవుతున్నది. అంతగా భారతీయుల సంస్కృతిలో భాగమైపోయింది గోరింటాకు. ఈ కళలో కొత్త ప్రయోగాలు చేస్తూ.. మెహిందీ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్నది గుజరాత్‌కు చెందిన సోనామిస్త్రీ. అరచేతులపై రకరకాల తీగలూ పువ్వులే కాదు, పోర్ట్రెయిట్ తరహా డిజైన్లూ వేయగలదు. ఏడేళ్ల నుంచీ మెహిందీ ప్రపంచంలోనే బతుకుతూ.. ఎన్నో అవార్డులూ రివార్డులూ అందుకున్నది. దేశంలోనే బెస్ట్ మెహిందీ ఆర్టిస్టుల్లో ఒకరిగా ప్రసిద్ధిచెందింది. వేడుకకు తగ్గట్టుగా, అతి సునిశితమైన డిజైన్లనూ అందంగా తీర్చిదిద్దగలదు సోనా.
మెహిందీ పేదవాళ్ల అరచేతులకూ చేరుకోవాలనే ఉద్దేశంతో వివిధ ఎన్జీవోలతో కలిసి పనిచేస్తున్నది. గోరింటాకు పురుషులకూ ఓ అలంకారమే అంటుందామె. ‘పెళ్లి వేడుకల్లో దుస్తుల డిజైనర్లకు, ఈవెంట్ ఆర్గనైజర్లకు వచ్చే గుర్తింపు మెహిందీ ఆర్టిస్టులకు రావడంలేదు. నిజానికి పెళ్లికూతురు అలంకరణలో ఇదో కీలక ఘట్టం. ఇక, నేను దీన్ని కెరీర్‌గా ఎంచుకున్నప్పుడు చాలామంది చిన్నచూపు చూశారు. ఇప్పుడు వాళ్లే నా గురించి గొప్పగా చెప్పుకొంటున్నారు. అందుకే ఎవరు ఏమన్నా సరే మనకు నచ్చిన పనిని చేస్తూపోవాలి. విజయం దానంతట అదే వరిస్తుంద’ని రేపటి తరానికి బోధిస్తున్నది సోనా. ఒక్కసారి ఆమె ఇన్‌స్టా పేజీలోకి వెళ్లి చూడండి.. రకరకాల డిజైన్లతో మెహిందీ ఆర్ట్ గ్యాలరీలా అనిపిస్తుంది.