గ్రంథాలయాలు చాలా ఊళ్లలో ఉంటాయి. కానీ కేరళలోని మొతక్కరలోని లైబ్రరీ మాత్రం చాలా ప్రత్యేకం. కొండలూ గుట్టలతో నిండిన ఆ ప్రాంతంలో ప్రజలు లైబ్రరీ వరకూ వెళ్లాల్సిన అవసరం లేదు. పుస్తకాలే గడపగడపకూ అందుతాయి. దీనికి కారణం రాధామణి అనే మహిళ. జీవితాలను మార్చే శక్తి ఒక్క అక్షరానికే ఉందని నమ్ముతారామె. గిరిజన స్త్రీలలో చదువు పట్ల ఆసక్తిని పెంచడం కోసం, ఇంటింటికీ వెళ్లి పుస్తకాలు ఇస్తారు. అక్కడి వాళ్లంతా రాధామణిని ‘నడిచే లైబ్రరీ’ అని పిలుస్తారు.
వయనాడ్కు దగ్గర్లోని మొతక్కర గ్రామంలో గిరిజనులు అధికం. వీళ్లలో చాలా మంది పొలం పనులతో రోజంతా కష్టపడతారు. ఆ ఊరి మహిళలతో ఉత్తమ సాహిత్యం చదివించాలనే ఉద్దేశంతో దాదాపు పదేండ్లుగా ఇంటికే పుస్తకాలు అందిస్తున్నారు రాధామణి. రోజూ ఓ నలభై వరకూ సంచిలో వేసుకుని దాదాపు ఆరు కిలో మీటర్లు నడిచి వెళతారు. రాధమ్మ పనిచేస్తున్న లైబ్రరీలో 11 వేల పుస్తకాలు ఉన్నాయి. పాఠకుల అభిరుచిని బట్టి ఒక్కొక్కరికి రెండు చొప్పున అందిస్తారు. అలా నెలకు దాదాపు 500 పుస్తకాలను చదువరుల ఇళ్లకు తీసుకెళ్లి ఇస్తారు. ప్రస్తుతం ఆ గ్రంథాలయంలో 102 మంది సభ్యులు ఉన్నారు. వాళ్లలో 94 మంది మహిళలే. పిల్లలు, వృద్ధుల కోసమూ ఆమె పుస్తకాలు తెస్తారు. ఒకప్పుడు ఒకటీ అరా వార్తా పత్రికలు తిరగేసిన ఆడవాళ్లే.. ఇప్పుడు నవలలు, జీవిత
చరిత్రలు, వ్యక్తిత్వ వికాస గ్రంథాలు చదువుతున్నారు. చక్కటి సమీక్షలూ చేస్తున్నారు. తమ కోసం అంత దూరం నుంచి వచ్చే రాధమ్మ అంటే గిరిజనులకు ఎంతో అభిమానం.