ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరుగుతున్న కొద్దీ రకరకాల ఆహారాల మీదా ప్రజల్లో ఆసక్తి కలుగుతున్నది. ఎలా తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? ఎక్కడి ఆహారంలో ఏం ప్రత్యేకతలున్నాయి? లాంటివీ చర్చల్లోకి వస్తున్నాయి. ఇటీవల శాస్త్రవేత్తలు మధ్యధరా ప్రాంతపు ఆహార అలవాట్ల మీద చేసిన పరిశోధనలో ఒక ఆసక్తికర విషయం వెల్లడైంది. అమెరికాలోని సదరన్ క్యాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో దాదాపు ఇరవై ఏండ్లకుపైగా చేసిన ఈ పరిశోధనలో మనుషుల్లో ముసలితనం రావడాన్ని నెమ్మదింపజేసేందుకు మధ్యధరా ప్రాంతపు ఆహారం తోడ్పడుతున్నదని తేలింది. అక్కడి ఆహారం మన శరీర కణాల్లోని ప్రత్యేక సూక్ష్మ ప్రొటీన్లను యాక్టివేట్ చేస్తున్నదని, అది గుండె, మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు సాయపడుతున్నదని చెబుతున్నారు పరిశోధకులు.
ఆ ప్రాంతంలో ఎక్కువగా ఆలివ్ నూనె, చేపలు, చిక్కుడు జాతి గింజలు, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలతోపాటు తక్కువగా ప్రాసెస్ చేసిన కార్బోహైడ్రేట్లు కలిగిన ఆహారాన్ని తీసుకుంటారు. ఇవి మన కణాల్లో శక్తిని ఉత్తేజితం చేసే మైటోకాండ్రియాలో ఉండే హ్యూమనిన్, ష్మూజ్ (ఎస్హెచ్ఎమ్ఓఓఎస్ఈ) అనే ప్రత్యేక ప్రొటీన్లను యాక్టివేట్ చేసేందుకు తోడ్పడుతున్నాయట. మెడిటెర్రేనియన్ డైట్‌ను చక్కగా అనుసరించే వారి రక్తంలో వీటి నమూనాలు ఎక్కువగా కనిపించాయట. ఇవి గుండె ఆరోగ్యంతో పాటు అల్జీమర్స్ లాంటి వ్యాధుల నుంచి రక్షణ కల్పించే మెదడు కణాల సంబంధిత ప్రక్రియలోనూ కీలకంగా పనిచేస్తాయి. అంటే ఈ ఆహారం ముసలితనాన్ని నెమ్మదింపజేసేలా, చిన్న వయసులో మరణాలను అరికట్టేలా తోడ్పడుతున్నదని ఈ అధ్యయనం చెబుతున్నది. అందుకే వృద్ధాప్యాన్ని ఆరోగ్యవంతంగా చేసే ఆహార ప్రణాళికల తయారీలో ఈ ఫలితాలు మంచి మార్గదర్శకాలు కానున్నాయి.