Cardamom | ఆహారానికి సువాసన అద్దే యాలకుల్లో ఔషధ గుణాలూ ఉంటాయి. ఇవి శరీరంలో వాత, పిత్త, కఫాలను సమతూకంలో ఉంచడంలో సాయపడతాయి. జీర్ణశక్తి మొదలుకుని శ్వాసవ్యవస్థ పనితీరు మెరుగుదల వరకు వివిధ రకాలుగా యాలకులను ఉపయోగిస్తుంటారు ఆయుర్వేద వైద్యులు. రాత్రి పడుకునే ముందు రెండు యాలకులు తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఎన్నో!
జీర్ణం సాఫీగా: యాలకులతో జీర్ణ వ్యవస్థకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. తిన్న తర్వాత కడుపుబ్బరం అనిపిస్తే యాలకులు నమిలితే సత్వర ఉపశమనం దొరుకుతుంది. రాత్రి పడుకునే ముందు యాలకులు తింటే గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం లాంటి పొట్ట సమస్యలు తగ్గుతాయి.
సహజ డిటాక్స్: యాలకులకు డైయూరెటిక్ (మూత్ర విసర్జన) గుణాలు ఉంటాయి. దీంతో శరీరంలో పేరుకున్న మలినాలు బయటికి వెళ్లిపోతాయి. అలా కిడ్నీల ఆరోగ్యానికి అండగా నిలుస్తాయి. శరీరానికి ఉన్న సహజ డిటాక్స్ క్రమాన్ని మెరుగుపరుస్తాయి.
నోటి దుర్వాసన దూరం: రాత్రి వేళ యాలకులు నమిలితే నోటి దుర్వాసన దూరమవుతుంది. దంతాలు, చిగుళ్లకు హానికరమైన బ్యాక్టీరియా నుంచి రక్షణ లభిస్తుంది.
బరువు తగ్గిస్తాయి: యాలకులు శరీర జీవక్రియలను నెమ్మదిగా పెంచుతాయి. వీటిలో ఉండే థర్మోజెనిక్ గుణాలు శరీరంలో క్యాలరీలను సమర్థంగా కరిగించేస్తాయి. రాత్రివేళ యాలకులు తింటే బరువు తగ్గడానికి దోహదపడతాయి.
ఒత్తిడిని తగ్గిస్తాయి: యాలకుల సుగంధం మనసుకు ప్రశాంతత చేకూరుస్తుంది. ఒక కప్పు యాలకుల టీ తాగితే శరీరంలో స్ట్రెస్ హార్మోన్ కార్టిసోల్ స్థాయులు తగ్గుతాయి. అలా ఒత్తిడి నుంచి ఉపశమనం దొరుకుతుంది. మూడ్ మెరుగుపడుతుంది.
చర్మం, జుట్టు ఆరోగ్యంలో: ఒక్క ఆరోగ్యం విషయంలోనే కాకుండా యాలకులు చర్మం, జుట్టు విషయంలోనూ మేలుచేస్తాయి. వీటిలో ఉండే యాంటి ఆక్సిడెంట్లు రక్త సరఫరాను మెరుగుపరుస్తాయి. దీంతో చర్మం మెరిసేలా తయారవుతుంది. యాంటి బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలపై పోరాడతాయి. యాలకుల్లో ఉండే పోషకాలు జుట్టును బలంగా చేస్తాయి. చుండ్రును నివారిస్తాయి.