లెక్కలంటే విద్యార్థులకు చుక్కలు కనిపిస్తాయి. ఎక్కాలు అడిగితే ఎక్కిళ్లొస్తాయి. కానీ, రామయ్య సార్ విద్యార్థులకు మాత్రం లెక్కలంటే లెక్కుండదు. ఏ సూత్రం అడిగినా టక్కున చెప్పేస్తారు. ఏ చిక్కు సమస్య ఇచ్చినా చిటికెలో పరిష్కరిస్తారు. రామయ్య సార్ బోధన విధానంతోనే ఇది సాధ్యమైంది. వినూత్న పద్ధతుల్లో విద్యార్థులను మెరికల్లా తీర్చిదిద్దుతున్నారు. రెండున్నర దశాబ్దాల నుంచి గణిత ఉపాధ్యాయుడిగా సేవలు అందిస్తున్న రామయ్య జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు.
ములుగు జిల్లా పరిధిలోని అబ్బాపూర్ గ్రామానికి చెందిన కందాల రాజయ్య, ప్రమీల దంపతుల నాలుగో సంతానం రామయ్య. తండ్రి గీత కార్మికుడు. ఇరవై ఏండ్ల కిందట అనారోగ్యంతో చనిపోయారు. అప్పటి నుంచీ రాజయ్యను తల్లి కష్టపడి చదివించింది. వికారాబాద్‌లో టీటీసీ చేసిన రామయ్య డిగ్రీ రెండో సంవత్సరంలో ఉండగానే.. 1998లో ప్రాథమిక ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించారు. నాటినుంచి పలు పాఠశాలల్లో పనిచేస్తూ ఎందరో విద్యార్థులకు అంకెల భిక్ష ప్రసాదించారు. తర్వాత స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొంది.. కాసిందేవిపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదేండ్లపాటు పనిచేశారు. విద్యార్థులకు గుణాత్మక విద్యను అందిస్తూ గణితంలో మేటిగా తీర్చిదిద్దారు. జిల్లా, రాష్ట్రస్థాయిలో జరిగే సైన్స్ ఫెయిర్లలో విద్యార్థులతో వినూత్నమైన ప్రయోగాలు చేయిస్తూ పలు అవార్డులు అందుకున్నారు. పిల్లలలో ఆవిష్కరణల పట్ల ఆసక్తిని రగిలించారు.
నిత్య విద్యార్థి
ఉపాధ్యాయుడిగా విద్యార్థులను తీర్చిదిద్దుతూనే, విద్యార్థిగా తన అభ్యాసాన్ని కొనసాగించారు రామయ్య. ఎమ్మెస్సీ, ఎంయీడీ పూర్తిచేయడంతోపాటు నెట్, సెట్ పరీక్షల్లో అర్హత సాధించారు. ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మనోవిజ్ఞాన శాస్త్రంలో పీహెచ్డీ చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం చేపట్టే అనేక విద్యా సంబంధ కార్యక్రమాల్లో విషయ నిపుణుడిగా పాల్గొంటున్నారు. 4, 5,10 తరగతుల గణిత పాఠ్య పుస్తకాలను రచించారు. గణిత ప్రయోగశాల, కృత్యాల రూపకల్పనలో రామయ్య నిష్ణాతులు. విద్యా పరిశోధన మండలి, కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగం నిర్వహించే జాతీయ సదస్సుల్లో పాల్గొని గణిత బోధన విధానాలపై ఎనిమిది పరిశోధన పత్రాలు సమర్పించారు. గణిత బోధనపై పలు పుస్తకాలు కూడా రచించారు. ‘జాతీయస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా పురస్కారానికి ఎంపిక కావడం నా బాధ్యత మరింత పెరిగింద’ని చెబుతారు రామయ్య.
దాతల సహకారంతో..
రామయ్య తాటికొండలో పనిచేసే రోజుల్లో (2018-21) పాఠశాల పురోగతికి ఎంతో కృషి చేశారు. పలు స్వచ్ఛంద సంస్థలు, పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రుల సహకారంతో నిధులు సమీకరించి, పాఠశాలకు కొత్తరూపు తీసుకొచ్చారు. ప్రతి సంవత్సరం విద్యార్థులకు నోటు పుస్తకాలు, తాగునీటి వసతి కల్పిస్తున్నారు. హెల్ప్ టు అదర్స్ సంస్థ సహకారంతో బెంచీలు సమకూర్చారు. గణిత ప్రయోగశాలను స్థాపించారు. దిశ ఫౌండేషన్ సౌజన్యంతో తరగతి గదులను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. పలు స్వచ్ఛంద సంస్థలను సమన్వయం చేసుకుంటూ.. మౌలిక వసతులు కల్పించడంలో కీలకంగా వ్యవహరించారు. ఇటీవల సొంత గ్రామం అబ్బాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఆయన బదిలీపై వచ్చారు. ఇక్కడ కూడా పాఠశాల అభివృద్ధికి పాటుపడుతున్నారు.
…?తిరుమలేశ్