కేక్ అంటే పైనాపిల్ ఫ్లేవర్ ఉండాలి. కింద వెనీలా ఎసెన్సో, బటర్‌స్కాచ్ రుచో తగులుతుండాలి. కానీ, ఇప్పుడు కేకులు కొత్త రూపాన్ని సంతరించుకుంటున్నాయి. ప్రయోగాల పేరుతో పాశ్చాత్య వంటకానికి సంప్రదాయ రుచులను కట్టబెడుతున్నారు. చాకొలెట్ ఫ్లేవర్ కేక్‌పైన కచోరీని ప్రతిష్ఠిస్తున్నారు. ప్లమ్ కేక్‌ను చికెన్ టిక్కాకు కేరాఫ్‌గా మార్చేస్తున్నారు. ఈ జుగల్బందీ కేక్‌లకు సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారమే లభిస్తున్నది. ఇడ్లీలోకి కొబ్బరి కారం, పూరీలోకి బొంబాయి చట్నీ, కచోరీలోకి టమాట సాస్.. ఒక్కో పదార్థం రుచిని ఆస్వాదించడానికి ఒక్కో కాంబినేషన్ ఉండాలని కోరుకునే సంప్రదాయ భోజనప్రియులకు ఈ కొత్త వాలకం కాస్త ఎబ్బెట్టుగా అనిపించినా.. విభిన్న రుచులను వినూత్నంగా ఆవిష్కరిస్తున్న తయారీదారులకు ఫాలోవర్లు పెరుగుతున్నారు. తూర్పు, పశ్చిమ రుచుల సం‘యోగాల’ను సాదరంగా ఆహ్వానిస్తున్నారు. రెసిపీ తెలుసుకొని సొంతంగా తయారు చేస్తున్నారు. కచోరీ కేక్, సమోసా కేక్, బటర్ చికెన్ కేక్, పనీర్ 65 కేక్ సహా కొవిడ్ రోజుల్లో దూరమైన స్ట్రీట్ ఫుడ్‌ను కేకుల్లో
దట్టించి ఆబగా లాగించేస్తున్నారు.