పూర్వం రాజుల కాలంలో ఆయాలకు మంచి డిమాండ్ ఉండేది. పిల్లలను కనేవరకే రాణిగారి బాధ్యత.. ఆపై వారి ఆలనాపాలనా అంతా దాదీలే చూసుకునేవారు. ఇప్పుడు కూడా సెలెబ్రిటీల ఇండ్లలో ఆయాల సంస్కృతి ఉంది. వారికి ఇచ్చే వేతనాల గురించి సోషల్ మీడియాలో తెగ చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సెలెబ్రిటీల ఆయాగా పేరున్న లలితా డిసిల్వా పేరును నెటిజన్లు తెగ సెర్చిస్తున్నారు. ఎంత సెలెబ్రిటీ కాకపోతే అంబానీ వారింట పెండ్లికి హాజరవుతుంది చెప్పండి! బాలీవుడ్ స్టార్‌కపుల్ సైఫ్ అలీ ఖాన్- కరీనాకపూర్ దంపతుల ముద్దుల తనయుడు తైమూర్ అలీ ఖాన్ పాలన లలితనే చూసుకుందట. అందుకుగానూ నెలకు రూ.2.5 లక్షలు జీతం అందుకుందని అప్పట్లో పుకార్లు షికారు చేశాయి. అంతేకాదు అంబానీ పిల్లలకు కూడా లలితనే కేర్‌టేకర్‌గా వ్యవహరించారట.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి మనవరాలు, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, ఉపాసన దంపతుల ముద్దుల కూతురు క్లీంకార ఆలనాపాలనా కూడా లలితనే చూసుకుంటున్నదని నెట్టింట చర్చ జరుగుతున్నది. అయితే, తనకు అందుతున్న జీతభత్యాల గురించి పీడియాట్రిక్ నర్స్ లలితా డిసిల్వా మొదటిసారి స్పందించారు. తైమూర్‌ను చూసుకున్నందుకు గానూ నెలకు లక్షల్లో జీతం అందుకున్నారట నిజమేనా అని అడిగిన ప్రశ్నకు ఆమె స్పందిస్తూ… ‘మీ నోట్లో చక్కెర పొయ్య! నిజంగా నేను రూ. 2.5 లక్షలు కోరుకుంటున్నాను’ అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో ఇప్పటిదాకా సామాజిక మాధ్యమాల్లో ఆమె వేతనంపై వచ్చిన వార్తలన్నీ పుకార్లే అని తేలింది. అంతేకాదు, కరీనా కుటుంబం చాలా సింపుల్‌గా ఉంటుందనీ, సిబ్బందిని ప్రేమగా చూసుకుంటుందని ప్రశంసించింది. ‘అందరం ఒకటే ఆహారం తింటాం. చాలాసార్లు అందరం కలిసి భోజనం చేస్తాం’ అని సెలెబ్రిటీ నాని చెప్పుకొచ్చింది.