కావలసిన పదార్థాలు
పనీర్ తురుము: ఒక కప్పు, ఆలుగడ్డ: ఒకటి (పెద్దది), పచ్చిమిర్చి: నాలుగు, కార్న్‌ఫ్లోర్: ఒక టేబుల్ స్పూన్, జీడిపప్పు: అర కప్పు, టమాట: నాలుగు, ఉల్లిగడ్డలు: రెండు(పెద్దవి), అల్లం: అంగుళం ముక్క, వెల్లుల్లి రెబ్బలు: నాలుగు, ఫ్రెష్ క్రీమ్: పావు కప్పు, వెన్న: ఒక టేబుల్ స్పూన్, యాలకులు: రెండు, లవంగాలు: నాలుగు, మిరియాలు: పది, దాల్చిన చెక్క: అంగుళం ముక్క, కారం: రెండు టీస్పూన్లు, ఉప్పు: తగినంత, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి: ఒక టీస్పూన్ చొప్పున, పసుపు: పావు టీస్పూన్, జీలకర్ర: అర టీస్పూన్, గరం మసాలా: అర టీస్పూన్, చక్కెర: రెండు టీస్పూన్లు, కొత్తిమీర తురుము: పావు కప్పు, నూనె: వేయించడానికి సరిపడా.
తయారీ విధానం
ఆలుగడ్డను ఉడికించి మెదిపి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో పనీర్ తురుము, ఆలుగడ్డ ముద్ద, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు, కొత్తిమీర తురుము వేసి బాగా కలిపి గుండ్రంగా కోఫ్తాలు చేసుకోవాలి. వాటిని దోరగా వేయించాలి. స్టవ్‌మీద పాన్‌పెట్టి ఒక టీస్పూన్ నూనె, వెన్న వేసి జీలకర్ర, యాలకులు, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, జీడిపప్పు వేసి దోరగా వేయించాలి. బాగా వేగాక తరిగిన టమాట ముక్కలు వేసి సన్నని మంటపై ఐదు నిమిషాలపాటు మగ్గించాలి. ఇప్పుడు కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కార్న్‌ఫ్లోర్, చక్కెర వేసి బాగా కలిపి మూతపెట్టి సన్నని మంటపై రెండు నిమిషాలు మగ్గనివ్వాలి. అంతా బాగా ఉడికి నూనె పైకి తేలాక స్టవ్ ఆర్పేసి మిశ్రమాన్ని చల్లార్చుకుని కొద్దిగా నీళ్లుపోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ మిశ్రమంలో అరకప్పు నీళ్లుపోసి సన్నని మంటపై ఉడికించాలి. బాగా ఉడికి నూనె పైకి తేలుతుండగా ఫ్రెష్‌క్రీమ్, గరం మసాలా వేసి ఒక నిమిషం తర్వాత కోఫ్తాలు, కొత్తిమీర తురుము వేసి మరో రెండు నిమిషాలు ఉడికిస్తే నోరూరించే మలాయ్ కోఫ్తా సిద్ధం. పైనుంచి క్రీమ్, వెన్న కూడా వేసుకోవచ్చు.