మామ్లా లీగల్ హై!
నెట్‌ఫ్లిక్స్: మార్చి 1
తారాగణం: రవికిషన్, నైలా గ్రేవాల్, నిధి, అనంత్ జోషి తదితరులు
దర్శకత్వం: రాహుల్ పాండే
OTT | ఓటీటీలో సినిమాలకన్నా వెబ్సిరీస్లే ఎక్కువ స్ట్రీమింగ్ అవుతున్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్స్‌కు జనం నీరాజనం పడుతున్నారు. కామెడీ వెబ్‌సిరీస్‌లనూ అదే రేంజ్లో ఆదరిస్తున్నారు. కాస్త కామెడీ ఫ్లేవర్‌తో కోర్టు వ్యవహారాలు, న్యాయవాదుల పరిస్థితులను తెలియజేస్తూ వచ్చిన ‘మామ్లా లీగల్ హై’ మంచి టాక్ తెచ్చుకుంది. ‘రేసుగుర్రం’, ‘కిక్ 2’తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన భోజ్‌పురి నటుడు రవికిషన్ ఇందులో ప్రధాన పాత్ర పోషించాడు. కథలోకి వెళ్తే.. ఢిల్లీ పరిధిలోని ‘పట్పర్గంజ్’ జిల్లా కోర్టులో త్యాగి (రవికిషన్) అడ్వొకేట్‌గా పనిచేస్తుంటాడు. పట్పర్గంజ్ న్యాయవాదుల సంఘానికి అధ్యక్షుడిగా ఉంటాడు.
జడ్జిగా పనిచేసిన త్యాగి తండ్రికి అపారమైన పేరుప్రఖ్యాతులు ఉంటాయి. తండ్రి పేరు వాడుకోకుండా తన కష్టంతోనే పైకి రావాలని అనుకుంటాడు త్యాగి. ఢిల్లీ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కావాలని భావిస్తుంటాడు. అటార్నీ జనరల్ కావడమే జీవిత లక్ష్యంగా పెట్టుకుంటాడు. మరోవైపు పట్పర్గంజ్ కోర్టు వ్యవహారాలు ప్రేక్షకులకు నవ్వు తెప్పిస్తాయి. కేసుల వాదనలు, లాయర్ల సమస్యలు, లాయర్ల మధ్య రాజకీయాలు ఇలా కలగాపులగంగా నడుస్తుంటాయి. మరోవైపు లాయర్ సుజాత కోర్టు ఆవరణలో ప్రత్యేకమైన చాంబర్ దక్కితే చాలు అనుకుంటుంది. సంపన్న కుటుంబానికి చెందిన అనన్య విదేశాల్లో న్యాయవిద్య అభ్యసిస్తుంది. లాయర్‌గా గొప్ప పేరు తెచ్చుకొని, ప్రజలకు న్యాయం అందించాలన్నది ఆమె ఆశయం. ఈ ముగ్గురి లక్ష్యాలు నెరవేరాయా? ఢిల్లీ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో త్యాగి గెలిచాడా? అన్నది మిగిలిన కథ! పెద్దగా మలుపులు లేకపోయినా… హాస్యభరితంగా సాగిన ‘మామ్లా లీగల్ హై!’ ప్రేక్షకులను అలరిస్తుంది.