తెలుగు వెండితెరపై ‘కొక్కొరొక్కో..’ పాటతో తొలిసారి పలికిందా కలం.‘నీలపురి గాజుల ఓ నీలవేణి..’ రచయితగా అతని ఉనికిని చాటింది.అక్కణ్నుంచి తెలుగు సినిమాలో తెలంగాణం పల్లవించడం మొదలైంది.కాసర్ల శ్యామ్ పాటల ప్రస్థానం పరుగులు తీసింది. ఆయన గీతం… ‘డీజే టిల్లు’ అల్లరికి వంతపాడింది. ‘చమ్కీల అంగీలేసి…’ ఇండస్ట్రీని దున్నేసింది! ఇప్పుడు తల్లి తీరంటి.. ‘బలగం’ పల్లెటూరు పాట జాతీయ పురస్కారం అందుకుంది. అమ్మ ప్రేమను రంగరించి రాసిన ఈ పాటకు పట్టం దక్కడం ఆనందంగా ఉందంటున్న మన తెలంగాణ బిడ్డ, జాతీయఉత్తమ గేయ రచయిత కాసర్ల శ్యామ్‌తో జిందగీ ప్రత్యేక సంభాషణ..
జాతీయ అవార్డు ప్రకటించినప్పుడు మీకు ఎలాంటి అనుభూతి కలిగింది?ఒక పల్లెకు, నా తల్లికి పట్టం కట్టినంత అనుభూతి చెందాను. మనం ఇన్ని చూసుకున్నా.. ఒక ఊరి పాట ఇప్పుడు దేశవ్యాప్తం అయింది. విశ్వవ్యాప్తం అయింది. మాటల్లో వర్ణించలేనంత ఆనందం కలిగింది. తెలంగాణ పదానికి ఉన్న శక్తి ఈ పాటతో మరోసారి రుజువైంది. జాతీయ పురస్కారం అందుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను.
‘ఊరు పల్లెటూరు..’ పాటకు ఇలాంటి పురస్కారం లభిస్తుందని ముందుగానే ఊహించారా?
పాట మొదలుపెట్టే సమయంలో ఎలాంటి అంచనాలు లేవు. కానీ, పాటంతా రూపుదిద్దుకున్న తర్వాత గట్టి నమ్మకం కలిగింది. సాహిత్యం మంచి స్థాయిలో ఉందనిపించింది. దర్శకుడు వేణు, సంగీత దర్శకుడు భీమ్స్, మేమంతా అయితే గట్టిగా నమ్మాం. తెలంగాణ పల్లె సౌందర్యం, అమ్మ ప్రేమ, అనుబంధాలు అన్నీ ఈ పాటలో అందంగా అమరాయి. మన మట్టి పరిమళం.. ‘ఊరు పల్లెటూరు..’లో ఊటలా ఉబికి వచ్చింది.
మీరు పుట్టింది, పెరిగింది అంతా హనుమకొండ పట్టణంలోనే కదా! పల్లెను అంత అందంగా వర్ణించడానికి ప్రేరణ ఏమిటి?నా బాల్యమంతా హనుమకొండలోనే సాగినా.. జానపదం అనే ఆయుధం నాకు బలమైంది. జానపద కళాకారుడిగా నేను తెలంగాణలోని పల్లెలెన్నో తిరిగాను. జానపద కళారూపాలు ప్రదర్శించే క్రమంలో.. ఎన్నో గ్రామాల్లో పర్యటించాను. ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారంలో, సాంఘిక దురాచారాలపై అవగాహన కల్పించే ప్రదర్శనల్లో భాగంగా చాలా ప్రాంతాలు సందర్శించాను. అలా పల్లెతో నాకు మంచి అనుబంధం ఏర్పడింది.
మిగతా రచయితలు రాసిన పల్లె పాటలు వింటూ పెరిగినవాణ్ని. ‘ఊరు పల్లెటూరు..’ పాట రాసేటప్పుడు గతంలో వచ్చిన పాటల తాలూకు పొడ లేకుండా.. కొత్తగా ఆవిష్కరించాలనుకున్నా. అమ్మ ప్రేమ కోణంలో పల్లెను చూపించే ప్రయత్నం చేశాను. పల్లె పాటలు అనగానే.. విషాద ఛాయలు కనిపించేవి. ఈ పాట అలా ఉండొద్దనుకున్నా. పల్లె అంటే మనకు పేగు బంధం లాంటిది. అక్కడి వాతావరణం, మట్టివాసన ఈ పాటలో ప్రస్ఫుటించేలా ప్రయత్నించా. మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ‘ఈ పాట మన సినిమాకు ముఖద్వారం’ అని దర్శకుడు అన్నమాటలు ఇప్పుడు గుర్తొస్తున్నాయి.
సాహిత్యం మీద అభిలాష ఎలా కలిగింది? హనుమకొండ నేపథ్యమే నన్ను రచయితగా తీర్చిదిద్దిందేమో! ముఖ్యంగా కాళోజీగారు నడయాడిన ప్రాంతంలో తిరిగాను. పట్టణంలో ఎన్నో సాంస్కృతిక సంస్థలు ఉండేవి. నిత్యం ఏదో ఒక సాహితీ గోష్ఠి జరిగేది. కవి సమ్మేళనాలు, పుస్తక ప్రదర్శనలు, ఉగాది ఉత్సవాలు.. ఇలా నగరమంతా సాహితీ సంద్రంలో ఓలలాడేది. ఈ వాతావరణం తెలియకుండానే నన్ను రచయితగా ప్రోత్సహించింది. అలా పదో తరగతి నుంచి కవిత్వం రాయడం అలవాటుగా మారింది. తర్వాత మా గురువులు వరంగల్ శంకరన్న, సారంగపాణన్న, దేవరత్ గారి పరిచయంతో జానపదం మీద ఆసక్తి పెరిగింది. అలిశెట్టి ప్రభాకరన్న ప్రభావం కూడా నాపై ఉంది. అనుకోకుండా జానపదంలో ఎం.ఎ., ఎంఫిల్ చేశాను. అలా సాహిత్యం నా శ్వాసగా మారింది. పాటల్లో నవ్వొచ్చే ఎక్స్ప్రెషన్స్, చమక్కులు ఉండేలా నాకంటూ ప్రత్యేక శైలిని ఏర్పర్చుకున్నాను.
మీ నాన్నగారు రంగస్థల నటులు కదా.. మరి మీరు రచన వైపు ఎందుకు వచ్చారు?
మా నాన్నగారు హనుమకొండలో రెగ్యులర్‌గా నాటకాలు వేసేవారు. సినిమాల్లోనూ ప్రయత్నించారు. ఓ 25 సినిమాల వరకు నటించారు. అయితే, ఆయన అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయారు. అప్పట్లో అవకాశాలు కూడా అంతంత మాత్రమే ఉండేవి. నాన్న సినిమా జర్నీ మధ్యలోనే ఆగిపోయినా.. నన్ను ప్రోత్సహించారు. ‘సినిమాల్లో నటుడిగా రాణించాలంటే బ్యాక్‌గ్రౌండ్ కావాలి. కులమో, ధనమో ఉండాలి. మనతోని అయ్యేపని కాదు. మనకు బుద్ధిబలమే పెట్టుబడి. మన సృజనాత్మకతే అవకాశాలు తెచ్చిపెడుతుంది. ఆ దిశగా ప్రయత్నించు’ అని నాన్న నా వెన్నుతట్టారు. ఆయన ప్రోత్సాహంతో పాటను పట్టుకున్నాను. సినిమా పాటల వరకు వచ్చాను. నాన్న కల ఎక్కడైతే ఆగిపోయిందో.. అక్కణ్నుంచే నా కళల ప్రయాణం మొదలు పెట్టాలని ప్రయత్నించాను. నాన్న నా సక్సెస్ చూశారు. కానీ, ఈ అవార్డు అందుకునే సమయంలో నాన్న, అమ్మ ఇద్దరూ లేరు. అదొక్కటే వెలితి.
సినిమాల్లో కన్నా ముందు జానపద గీతాలు రాయడానికి అవకాశం ఎలా వచ్చింది? మా గురువుల ప్రోద్బలంతోనే జానపద గీతాలు రాశాను. జానపద గీతాలను కమర్షియల్ హంగులతో ప్రజెంట్ చేయడం నాతోనే మొదలైందేమో! హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయంలో ఎం.ఎలో చేరిన తర్వాత జానపదం ఎంత పెద్ద సముద్రమో తెలిసింది. నేను నేర్చుకున్నది, రాసేది ఎంత తక్కువో అప్పుడు అర్థమైంది. వరంగల్‌లో ఉన్నప్పుడు జనాలను ఎట్లా ఉర్రూతలు ఊగించాలి, ఎట్లా పేరు తెచ్చుకోవాలి ఇలా కమర్షియల్ థింకింగ్ ఉండేది. ఇక్కడికి వచ్చాక సంప్రదాయ జానపదం ఎన్ని రకాలుగా ఉంటుంది. ఎన్ని కోణాల్లో పాటలు ఉంటాయి? ఏఏ అంశాలు స్పృశించొచ్చు.. ఇవన్నీ తెలిసొచ్చాయి. దేశవ్యాప్తంగా ఉండే వివిధ జానపద శైలులు కూడా పరిచయం అయ్యాయి. విభిన్నమైన శైలిలో పాటలు రాయడానికి ఊతం దొరికినట్టయింది.
ఇండస్ట్రీలో మొదటి అవకాశం ఎలా వచ్చింది? దర్శకురాలు జయ మేడం ‘చంటిగాడు’ సినిమాతో నాకు తొలి అవకాశం ఇచ్చారు. అందులో ‘కొక్కొరొక్కో..’ అని జానపద బాణీలో పాట రాశాను. మొదటి ఆరేడేండ్లు ఏడాదికి ఒక్కో పాట మాత్రమే రాయగలిగాను. పెద్దగా అవకాశాలేం రాలేదు. 2013లో ‘మహాత్మ’ సినిమాతో నా పేరు గట్టిగా వినబడింది. అందులో నేను రాసిన ‘నీలపురి గాజుల ఓ నీలవేణి..’ పాట సూపర్ హిట్ అయింది. అయినా కూడా పెద్దగా అవకాశాలు రాలేదనే చెప్పాలి. 2016లో వచ్చిన ‘లై’ సినిమా కోసం రాసిన ‘బొమ్ బొంబాట్..’ పాటతో లైమ్ లైట్లోకి వచ్చాను. తర్వాత లిరిసిస్ట్‌గా నాకంటూ ఒక ఇమేజ్ ఏర్పర్చుకోగలిగాను. మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు.
మీ పాటల్లో తెలంగాణ పదాలు, సంస్కృతి మేళవించి ఉంటాయి. ఈ విషయంలో దర్శక, నిర్మాతలను మీరు కన్విన్స్ చేయాల్సి వచ్చేదా! ఏమైనా అభ్యంతరాలు ఎదుర్కొన్నారా? ఎలాంటి అభ్యంతరాలు ఎదుర్కోలేదు. నేను విరివిగా పాటలు రాస్తున్న సమయానికే తెలంగాణ ఏర్పడింది. పరిస్థితులు మారిపోయాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల మీద ఆసక్తి ఏర్పడింది. ప్రత్యేకించి తెలంగాణ స్లాంగ్ కోరుకున్నవారే ఎక్కువ! అదే సమయంలో మన తెలంగాణ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున టాలెంట్ ఇండస్ట్రీలోకి వచ్చింది. మన కథలు తెరకెక్కడం ఎక్కువైంది. ఈ నేపథ్యంలో… తెలంగాణ మాండలికానికి వెండితెరపై బంగారు తివాచీ పరిచినట్టయింది. వరంగల్‌లో ఉన్నప్పుడు నేను ఒంట బట్టించుకున్న కమర్షియల్ జానపదం.. ఇప్పుడు నాకు అక్కరకొచ్చింది.
పాట రాసేముందు ఎలాంటి హోమ్‌వర్క్ చేస్తారు? కథ చెప్పినా, సన్నివేశం చెప్పినా ముందుగా దర్శకుడి కోణం నుంచి చూస్తాను. అంతకుముందు ఈ తరహా పాటలు ఏ కోణంలో వచ్చాయో చూస్తాను. వాటికి భిన్నంగా, ప్రత్యేకంగా ఎలా రాయాలో ఆలోచిస్తాను. అందులో మన మార్క్, మన మాండలికం, కాయినింగ్ వర్డ్స్‌తో ప్రత్యేకంగా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నిస్తాను.
మీ పాటలు లోకల్ ఫ్లేవర్ ఉట్టి పడేలా పాడటమూ అంతే ముఖ్యం. ఇందు కోసం గాయనీ, గాయకులను ఎంపిక చేయడంలో మీ ప్రమేయం ఉంటుందా? అలాగే ఆయా పదాల ఉచ్ఛరణ విషయంలో వాళ్లకు మీరు సాయం చేస్తారా? తెలుగు తెలిసి, తెలంగాణ యాస పలికే గాయకులు ఉన్నప్పుడు అంతగా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం రాదు. ‘చమ్కీల అంగీలేసి..’ పాట పాడిన గాయని పేరు ధీ. ఆమె శ్రీలంకన్ తమిళియన్. తనకు తెలుగే సరిగా రాదు. తెలంగాణ మాండలికం అసలే రాదు. ఇలాంటి సమయంలో.. దగ్గర ఉండి, ఏ పదం ఎలా పలకాలో చెబుతాను. గాయనీ గాయకుల ఎంపిక విషయంలో దర్శకుడు, సంగీత దర్శకుడు అడిగితే.. ఆ పాటకు ఎవరైతే బాగుంటుందో సూచిస్తాను.
కొన్ని సినిమాల్లో అక్కడక్కడా కనిపించినట్టున్నారు! నటుడిగా, కథా రచయితగా రాణించాలనే ఆలోచన ఏదైనా ఉందా? ఏదో సరదాగా నటించానంతే! ఎప్పుడైనా దర్శకులు అడిగితే చేసినవే!! నటుడిగా మారే ఆలోచన లేదు. గీత రచయితగానే ఉంటాను. నా ధ్యాసంతా పాటల మీదే! ఈ అవార్డు వచ్చిన తర్వాత నా బాధ్యత ఇంకా పెరిగింది. ఎక్కడా స్టాండర్డ్స్ తగ్గకుండా రాయాలి. నా దగ్గరికి వచ్చేవాళ్లు కూడా ఒక స్థాయి ఆశిస్తారు. అది తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాదే!
మీరు చాలా అభిమానించే గేయ రచయిత ఎవరు? ఆయనతో మీకున్న అనుబంధం?
నేను బాగా అభిమానించేది చంద్రబోసన్నని. మేమిద్దరం ఒకే జిల్లాకు చెందినవాళ్లం. మనోడెవరైనా బాగా పేరు తెచ్చుకుంటే.. వారిని మనం కచ్చితంగా ఐకానిక్‌గా ఫీలవుతాం. ఆయన్ను ఒక గురువుగా భావిస్తా. చంద్రబోసన్న పాటను చాలా సింప్లిఫై చేశారు. చాలా భిన్నంగా రాస్తుంటారు. ఆ పాటలు విని, స్ఫూర్తి పొందాను. మొదట్నుంచి ఆయన నన్ను ఎంకరేజ్ చేశారు. నా నుంచి ఏదైనా మంచి పాట వస్తే.. ముందుగా ఆయన ప్రశంసే వస్తుంది. నిన్న కూడా ఫోన్ చేసి మెచ్చుకున్నారు. ‘జాతీయ పురస్కారం కోసం.. యజ్ఞంలా కష్టపడ్డాను. నాకు పాతికేండ్లు పట్టింది. నువ్వు తొందరగా అందుకోగలిగావు’ అని
అభినందించారు.
ఎందరో గురువులు జానపద సాహిత్యాన్ని పెంచి పోషించారు. పదుల సంఖ్యలో యువతీ యువకులు వారి దగ్గర శిష్యులుగా ఉండేవారు. శంకర్ గారు, సుద్దాల బాలన్న, మిద్దె రాములన్న, చుక్క సత్తయ్య, రాయలసీమ నుంచి ముణయ్య, నర్సింహమూర్తి, చలపతిరావు.. ఇలా ఎందరో ఉండేవారు. పోటీలు పడి ప్రదర్శనలు ఇచ్చేవాళ్లు. యూట్యూబ్ కల్చర్ ఇప్పుడొచ్చింది కానీ, అప్పట్లో వీళ్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వారి వెంట శిష్యగణం కూడా అలాగే ఉండేది. ఒక్కో గురువును పది నుంచి పాతికమంది ఫాలో అయ్యేవారు. వాళ్లు పాటలను సేకరించే విధానం, వాటిని పాడే తీరు ఇవన్నీ ఆకళింపు చేసుకునేవాళ్లు. అప్పట్లో ‘జానపద కళా సంబురాలు’ అని చేస్తే… ఓ నలభైమంది వరకు గురువులు వచ్చేవాళ్లు. వారివెంట పదేసి మందిని వేసుకున్నా.. ఓ 400 మంది జానపద కళాకారులు తరలివచ్చేవాళ్లు. అంత ఆదరణ ఉండేది.