గడిచిన రెండు దశాబ్దాలలో వచ్చిన సాంకేతిక పురోగతిలో భాగంగా మహిళల జీవితాల్లోకి చొచ్చుకొచ్చిన వస్తువుల్లో ఒకటి.. బ్రెస్ట్ పంప్. ఇటీవలి కాలంలో ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య పెరగడంతో దీని వినియోగమూ అధికమైంది. కాకపోతే, పంప్ ఉన్నా సరే నేరుగా బిడ్డకు పాలివ్వడమే ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.
పందొమ్మిదో శతాబ్దం మధ్యకాలంలో బ్రెస్ట్ పంప్స్ ప్రపంచానికి పరిచయం అయ్యాయి. లోపలికి చొచ్చుకుని పోయినట్టు ఉండే చనుమొనలను సరిచేయడానికి, నేరుగా తాగే శక్తి లేని పిల్లలకు చనుబాలు అందించేందుకూ దీనిని తొలుత వాడారు. ఆ తర్వాత ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్ రంగప్రవేశం చేసింది. దీని ద్వారా పాలు తీసి బిడ్డకు అవసరం ఉన్నప్పుడు పట్టవచ్చు. అయితే పాపాయికి నేరుగా పాలివ్వకుండా, బ్రెస్ట్ పంప్‌ను వినియోగించే మహిళల్లో పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి.
ఎందుకంటే బిడ్డను ఒడిలోకి తీసుకుని పాలివ్వడం వల్ల ఆ స్పర్శకు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇది పాలు దండిగా వచ్చేందుకు సాయపడుతుంది. అంతేకాదు ఈ హార్మోన్ తల్లీ బిడ్డల మధ్య ప్రేమానురాగాలను బలపరుస్తుంది. అందుకే, ఆక్సిటోసిన్‌ను ‘లవ్ హార్మోన్’ అని పిలుస్తారు. అందుకే ఎంత పని ఒత్తిడిలో ఉన్నా సరే, బిడ్డకు నేరుగా పాలివ్వడానికే ప్రాధాన్యం ఇవ్వాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. దీనివల్ల సమృద్ధిగా పాలు ఉత్పత్తి అవుతాయి, తల్లీ బిడ్డల మధ్య బంధమూ బలపడుతుంది.