రోజంతా ఇంటి పనుల్లో అలసిపోయే అమ్మలకు, అక్కలకు కాలక్షేపాన్ని ఇచ్చేది టీవీ సీరియళ్లే. మన చుట్టూ తిరిగే వ్యక్తిత్వాలే పాత్రల రూపంలో కనిపిస్తూ ఉంటాయి కాబట్టి, ప్రేక్షకులకూ నచ్చుతాయి. కానీ, ఓ సీరియల్ ఎక్కువకాలం నడవాలంటే, అందులో కథ బలంగా ఉండాలి. పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులను మెప్పించగల నటీనటులు ఉండాలి. అప్పుడే ప్రేక్షకాదరణ లభిస్తుంది. 1000 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న జీ తెలుగు ‘గుండమ్మ కథ’ విజయ రహస్యమూ ఇదే. ఈ ధారావాహికలో గీత పాత్రలో వీక్షకులను మెప్పిస్తున్న నటి పూజామూర్తి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘సమాజంలో ఇప్పటికీ బాహ్య స్వరూపం గురించి తప్పుగా మాట్లాడుతూ ఇతరులను బాధపెడుతుంటారు. కానీ, మనిషి వ్యక్తిత్వమే అన్నిటికన్నా ముఖ్యం. ఎదుటివారు లావుగా ఉన్నారనో, రంగు తక్కువనో కించపరచకూడదు. ఈ సందేశాన్నే మేము గుండమ్మ కథ సీరియల్ ద్వారా చెప్పాం’అంటారామె.