మనిషికి క్రీడలు శారీరకంగాను, మానసికంగానూ ఎంతో మేలు చేస్తాయి. అయితే ఫుట్‌బాల్, క్రికెట్, కబడ్డీ, బ్యాడ్మింటన్, వాలీబాల్, బాసెట్ బాల్, టెన్నిస్ లాంటి ఆటల్లో గాయాలు కూడా సహజం. వాటిలో అత్యంత సాధారణంగా కనిపించే సమస్య ‘లిగమెంట్ గాయాలు’. గతంలో ఇవి ప్రధానంగా ప్రొఫెషనల్ క్రీడాకారులకే పరిమితమయ్యేవి. ఇప్పుడు ఫిట్నెస్ కోసం జిమ్‌కు వెళ్లేవారిలో, మారథాన్‌లో పాల్గొనేవారిలో, వీకెండ్ స్పోర్ట్స్ ఆడేవారిలో, పాఠశాల, కళాశాల విద్యార్థుల్లోనూ ఈ గాయాలు ఎకువగా కనిపిస్తున్నాయి. మోకాలు, చీలమండ, మణికట్టు లాంటి కీళ్ల వద్ద లిగమెంట్ దెబ్బతింటే సాధారణ నడక కూడా కష్టమవుతుంది. సరైన సమయంలో చికిత్స తీసుకుంటే పూర్తిగా కోలుకునే అవకాశం ఉన్నప్పటికీ… నిర్లక్ష్యం చేస్తే శాశ్వత సమస్యగా మారే ప్రమాదం లేకపోలేదు.
ఎముకలను ఒకదానితో ఒకటి కలిపి కీళ్లకు స్థిరత్వాన్ని కల్పించే బలమైన కణజాలాన్ని ‘లిగమెంట్’ అంటారు. ఇవి కీళ్లు సహజంగా కదిలేలా చేయడంతో పాటు అవసరానికి మించిన కదలికలను నియంత్రిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే తలుపులకు హింజెస్లు ఎలా పనిచేస్తాయో కీళ్లకు లిగమెంట్లు కూడా అలానే పనిచేస్తాయి. ఒకవేళ అధిక ఒత్తిడి, అకస్మాత్తుగా మెలిక తిరగడం లేదా బలంగా ఢీకొనడం వల్ల లిగమెంట్ లాగినట్టు కావడం లేదా చిరిగిపోవడం జరుగుతుంది.
మోకాలి ఏసీఎల్ (అంటీరియర్ క్రూసియేట్ లిగమెంట్) ఇది అత్యంత సాధారణంగా కనిపిస్తుంది. వైద్య అధ్యయనాల ప్రకారం ఏసీఎల్ గాయాలు పురుషులతో పోలిస్తే మహిళల్లోనే ఎకువగా కనిపిస్తున్నాయి. దీనికి కారణాలు మహిళల శరీర నిర్మాణం, హార్మోన్ల ప్రభావం, కండరాల బలం తకువగా ఉండటం, జంప్ ల్యాండింగ్ పద్ధతిలో లోపాలు ఉండటం.


సాధారణంగా ఏదైన గాయం కారణంగా లిగమెంట్లు దెబ్బతిన్నప్పుడు ఈ కింది లక్షణాలు కనిపిస్తాయి.
గ్రేడ్-1: లిగమెంట్ స్వల్పంగా లాగినట్టు అవుతుంది.
గ్రేడ్-2: పాక్షికంగా చిరిగిపోతుంది.
గ్రేడ్-3: పూర్తిగా తెగిపోతుంది. చాలా సందర్భాల్లో శస్త్రచికిత్స అవసరం.
గాయం అయిన వెంటనే ఆర్.ఐ.సి.ఈ విధానం పాటించాలి. అంటే
ఆర్-రెస్ట్ (విశ్రాంతి తీసుకోవాలి)
ఐ- ఐస్ (గాయమైన చోట ప్రతి 2- 3 గంటలకు 15- 20 నిమిషాలపాటు ఐస్ పెట్టాలి).
సీ- కంప్రెషన్ (ఎలాస్టిక్ బ్యాండేజ్‌తో బిగించాలి).
ఈ- ఎలివేషన్ (గాయపడిన భాగాన్ని గుండె స్థాయి కంటే ఎత్తుగా ఉంచాలి).
మొదటి 48 గంటల వరకు వేడి నీటి కాపడం చేయకూడదు.

స్వల్ప గాయాలు అయినప్పుడు విశ్రాంతి తీసుకోవాలి. వైద్యుల సూచన మేరకు నొప్పి నివారణ మందులు వాడాలి. ఫిజియోథెరపీ చేయించుకోవాలి. మోకాలి పట్టీ ధరించాలి.
తీవ్రమైన గాయాలైనప్పుడు : లిగమెంట్ పూర్తిగా తెగిపోతే ఆర్థ్రోసోపిక్ లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ శస్త్రచికిత్స చేస్తారు. ఇది కీహోల్ పద్ధతిలో చిన్న రంధ్రాల ద్వారా చేసే ఆధునిక సర్జరీ. దీంతో నొప్పి తకువగా ఉండటంతో పాటు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. అయితే లిగమెంట్ గాయాలైనప్పుడు అందించే చికిత్స విజయవంతం కావడంలో వైద్యుడి పాత్ర 50 శాతం వరకు ఉంటుంది. మరో 50శాతం ఫిజియోథెరపీ పాత్ర ఉంటుంది. అంటే వైద్యుడు ఎంత మెరుగైన చికిత్స అందించినప్పటికీ ఫిజియోథెరపీ సరిగ్గా చేయించుకోకపోతే ఫలితం ఉండదు. అదేవిధంగా సరైన వైద్యం లేకుండా ఫిజియోథెరపీ చేయించుకున్నా ఫలితం ఉండదు.
లిగమెంట్ గాయాలు సాధారణమైనవే అయినప్పటికీ వాటిని తేలికగా తీసుకోవడం ప్రమాదకరం. నొప్పిని భరిస్తూ ఆట కొనసాగించడం, స్వయంగా మందులు వాడటం, వైద్యులను సంప్రదించకుండా ఆలస్యం చేయడం వల్ల గాయం మరింత తీవ్రమవుతుంది. ఆధునిక వైద్యం, ఆర్థ్రోసోపిక్ శస్త్రచికిత్సలు, సమర్థవంతమైన ఫిజియోథెరపీ వల్ల ప్రస్తుతం చాలా మంది క్రీడాకారులు పూర్తిగా కోలుకుని మళ్లీ మైదానంలోకి వస్తున్నారు.