కూర్చొని పనిచేసే ఉద్యోగుల్లో బద్ధకం పెరిగిపోతుంటుంది. హుషారు తగ్గిపోతుంటుంది. ముఖ్యంగా మెట్రో నగరాల్లోని డెస్క్ ఉద్యోగుల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇలాంటి ఉద్యోగాలు చేస్తున్నా రోజుకు కనీసం 30 నిమిషాలైనా వ్యాయామం చేయడానికి వారికి కుదరడం లేదని తాజా అధ్యయనం ఒకటి పేర్కొన్నది. ఫలితంగా వారిలో హృద్రోగ సమస్యలు 40 శాతం పెరిగినట్లు తేలింది. ఈ క్రమంలో ఉద్యోగులు కాస్త హుషారు పెంచుకోవాల్సిన అవసరం ఉన్నదని సర్వేకారులు చెబుతున్నారు.
రోజంతా కూర్చొనే ఉండటం, తక్కువ శారీరక శ్రమ.. ఉద్యోగుల్లో గుండె సమస్యలను పెంచుతున్నది. ఏఐ ఆధారిత హెల్త్‌కేర్ సంస్థ ‘ఎకిన్కేర్’ ఇటీవల ‘ది ఇండియా ఇంక్ హార్ట్ ఇండెక్స్ : రిస్క్ అండ్ యాక్షన్’ పేరుతో ఒక నివేదిక విడుదల చేసింది. ఇందులో డెస్క్ ఉద్యోగాలు చేస్తున్నవారి ఆరోగ్యం గురించి పలు ఆందోళనకర విషయాలను బయటపెట్టింది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో పనిచేస్తున్న వారిలో 40 శాతం గుండె జబ్బుల కేసులు పెరిగినట్లు వెల్లడించింది. శారీరక శ్రమ లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని గుర్తించింది. దాదాపు 65 శాతం మంది ఉద్యోగులు రోజుకు కనీసం 30 నిమిషాల కంటే తక్కువ సమయం వర్కవుట్లు చేస్తున్నట్లు పేర్కొన్నది. ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహిస్తేనే.. హృద్రోగ సమస్యలను తగ్గించొచ్చని చెప్పుకొచ్చింది.
రోజుకు 30 నిమిషాల నడక, స్ట్రెచింగ్ లాంటి తేలికపాటి వ్యాయామాలు చేయాలని అధ్యయనకారులు సూచిస్తున్నారు. లేకుంటే, బరువుతోపాటు రక్తపోటు కూడా పెరిగి.. చిన్న వయసులోనే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తున్నారు. నిద్రలేమిని జయించాలనీ, ప్రతిరోజూ 7-8 గంటల నాణ్యమైన నిద్ర ఉండేలా చూసుకోవాలని సిఫారసు చేస్తున్నారు. ఇక ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు అవసరమనీ, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని చెబుతున్నారు. పని సమయంలో ప్రతి గంటకూ చిన్న విరామం తీసుకోవాలనీ, నడుస్తూ సమావేశాలు నిర్వహించాలని సూచిస్తున్నారు. ఇలా.. జీవనశైలిలో మార్పులతో గుండె ఆరోగ్యానికి భరోసా దక్కుతుందని అంటున్నారు.