ధైర్యం మగవాడి ఆస్తి కాదు. భయం ఆడవాళ్ల ఆభరణం కాదు. గుండెల నిండా ధైర్యం, అంతకుమించిన మనోబలం మాలోనూ ఉన్నాయంటూ డిటెక్టివ్ వృత్తిలోకి అడుగుపెట్టిందామె. రహస్యాలు ఆరా తీస్తూ, చిక్కుముళ్లు విప్పుతూ, చీకటి నిజాలను వెలుగులోకి తెస్తూ వెలుగులోకి వచ్చింది రజనీ పండిట్. నేరస్తులతో కుస్తీ, వృత్తిలో పోటీపడుతూ గెలిచి, నిలిచిన ‘లేడీ జేమ్స్‌బాండ్’ రజని పండిట్ కథ ఇది.
కాలేజీ రోజుల్లోనే డిటెక్టివ్ ప్రయాణం మొదలుపెట్టింది రజని పండిట్. తనతోపాటు చదివే ఒకమ్మాయి ప్రవర్తన ఆమెకు వింతగా అనిపించేది. చాటుగా ఆ అమ్మాయిని అనుసరించింది. ఆ అమ్మాయి ధూమపానం, మద్యపానం చేస్తున్నట్లు కనిపెట్టింది. చెడు సావాసాలు చేయడం గమనించింది. కాలేజీ క్లర్క్ ద్వారా ఇంటి అడ్రస్ తెలుసుకుని, ఓ రోజు వాళ్లింటికి పోయింది. ఆ అమ్మాయి అమ్మానాన్నలకు కూతురు చెడు స్నేహాలు, దురలవాట్ల గురించి చెప్పింది. ఆ తర్వాత.. ఆ అమ్మాయి అవన్నీ మానేసి, తల్లిదండ్రులు చెప్పినట్టు బుద్ధిగా చదువుకోవడం మొదలుపెట్టింది. అలా అనుకోని కేస్ సాల్వ్ చేసిన రజని తర్వాత డిటెక్టివ్‌గా అడుగులు వేసింది.
రజని ఛేదించిన రహస్యాల గురించి మెల్లమెల్లగా అందరికీ తెలిశాయి. పత్రికలు ‘లేడీ షెర్లాక్’, ‘లేడీ జేమ్స్ బాండ్’ అంటూ ఆమె గురించి కథనాలు ప్రచురించాయి. మొదట్లో ఆ వార్తా కథనాలు తన గురించేనని ఆమెకు తెలిసేది కూడా కాదట. కొన్నాళ్లకు దూరదర్శన్ వాళ్లు ఆమెను ఇంటర్వ్యూ చేశారు. అలా ఆమె పేరుప్రఖ్యాతులు దేశవ్యాప్తం అయ్యాయి. అదే సమయంలో ఆమెపై కేసులు కూడా నమోదయ్యాయి. ముంబయి కేంద్రంగా ఉంటూ రజని దేశ, విదేశాల్లోని కేసులనూ ఛేదించింది. ఒక్కో కేసుని సాల్వ్ చేయడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకునేది. రెండేళ్ల వరకు ఒంటరిగానే కేసులు పరిష్కరించింది. తర్వాత ఒక టీమ్‌ను ఏర్పాటు చేసుకుంది. కేస్ తీవ్రతను బట్టి అండర్ కవర్‌కు కూడా వెళ్లేది. వేషాలు మార్చి, రెక్కీలు చేసి… నిజాలు రాబట్టేది.
ముంబయిలోని శివాజీ పార్క్ ఏరియాలో ‘రజని పండిట్ డిటెక్టివ్ ఏజెన్సీ’ని ఏర్పాటు చేసింది. అన్ని రకాల కేసులను తీసుకునేది. వ్యక్తులు కనిపించకుండా పోయినవి, బ్యాంక్ మోసాలు, ఆర్థిక నేరాలు, ఆస్తి తగాదాలు, వ్యక్తులను ఆరా తీయడం, కంపెనీల ఒప్పందాల్లో మోసాలు, ఉద్యోగ నియామకాల్లో విచారణ వంటి కేసులను విచారించేది. తనపై చాలామంది తప్పుడు కేసులు పెట్టారు. కానీ, అవేవీ చట్టం ముందు చెల్లలేదు. తన నిజాయతీ, ఆలోచనను ప్రభుత్వాధికారులు అభినందించేవారు. పోలీసు శాఖ ఉద్యోగ అవకాశం ఇస్తామన్నా, సొంతంగా పని చేసుకోవడంలోనే సంతృప్తి ఉందని తిరస్కరించింది. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ మూడు దశాబ్దాలకుపైగా డిటెక్టివ్‌గా రాణిస్తున్నది రజని. ఆరు పదుల వయసులోనూ నిర్విరామంగా ఇన్వెస్టిగేట్ చేస్తూనే ఉంది.
డిటెక్టివ్‌గా రజని పండిట్ వేలాది కేసులు పరిష్కరించింది. 57 అవార్డులు అందుకుంది. తను ఛేదించిన కేసుల ఆధారంగా మరాఠీలో ‘ఫేస్ బిహైండ్ ఫేస్’, ‘మాయాజల్’ అనే పుస్తకాలు రాసింది. ఈ పుస్తకాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి. రజని జీవిత విశేషాలతో ‘లేడీ జేమ్స్ బాండ్’ పేరుతో ఓ డాక్యుమెంట్ ఫిల్మ్ కూడా రూపొందింది.