చికిత్స కంటే నివారణే ఉత్తమమైనది అని తరచుగా వింటుంటాం. ఖరీదైన చికిత్స, ప్రాణహాని కలిగించే రోగాలపట్లే కాదు వస్తే పోని పలురకాల జబ్బులకు కూడా ముందు జాగ్రత్తే ఉత్తమం. ముఖ్యంగా నలభై దాటాక ఆరోగ్య పరీక్షలు చేయించుకున్న వాళ్లు… ఆరోగ్యంగానే కాదు, ఆర్థికంగానూ బాగుంటారు. అయితే ఆరోగ్యంపై అవగాహన లేక చాలామంది వైద్య పరీక్షల విషయంలో దాటవేత ధోరణి ప్రదర్శిస్తుంటారు.
పరీక్షలు చేయించుకుంటే ఏదైనా రోగం బయటపడుతుందనే భయంతోనూ కొందరు టెస్ట్‌లకు వెనకడుగు వేస్తుంటారు. కానీ, ముదిరిన తర్వాత రోగం బయటపడితే, చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా బతుకు తయారవుతుంది. అందుకే ఒక వయసు వచ్చిన తర్వాత ఏడాది, రెండేండ్లకు ఒకసారైనా
వైద్య పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం.
ఆరోగ్యంగా ఉండేందుకు, రాబోయే రోగాలను అంచనా వేసేందుకు ఏ వయసులో ఏ పరీక్షలు చేయించుకోవాలో నిపుణులు సూచిస్తున్నారు. ఎన్నాళ్లకు ఒకసారి పరీక్షలు అవసరమో చెబుతున్నారు. ఫుల్‌బాడీ చెకప్‌లకు డబ్బులు వృథా చేయకుండా, వయసుకు తగ్గ వైద్య పరీక్షలు చేయించుకోవాలని సలహా ఇస్తున్నారు. లక్షణాలేవీ బయటపడకుండా శరీరంపై దాడి చేసే రోగాల విషయంలో నలభై దాటాక అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. కొన్ని పరీక్షలు అనివార్యంగా చేయించుకోవాలి.
బీపీ: కనీసం ఏడాదికి ఒక్కసారైనా బీపీ చెకప్ చేయించుకోవాలి. హైపర్ టెన్షన్ అనేది గుండెపోటు, గుండె జబ్బులకు దారితీస్తుంది. కాబట్టి రెగ్యులర్‌గా బీపీ చెకప్ చేసుకుంటూ ఉండాలి.
ఫాస్టింగ్ గ్లూకోజ్ / గ్లయికాసిలేటెడ్ హిమోగ్లోబిన్ (హెచ్‌బీఏవన్‌సీ): కనీసం మూడేళ్లకు ఒకసారి చేయించుకోవాలి. ఇది చిన్న వయసులోనే వచ్చే డయాబెటిస్, బరువు కోల్పోవడాన్ని ముందే చెబుతుంది. లిపిడ్ ప్రొఫైల్: ప్రతి మూడు నుంచి అయిదేండ్లకు ఒకసారి చేయించాలి. సాధారణ కొలెస్ట్రాల్ లెక్క తప్పుదారి పట్టిస్తుంది. కాబట్టి ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ పరిమాణంపై దృష్టిపెట్టాలి. శరీర బరువు, నడుము చుట్టుకొలత: పొట్ట పెరగడం రక్తప్రసరణ వ్యవస్థపై ప్రతికూలత చూపుతుంది. అందుకే శరీరంలో వచ్చే మార్పులు గమనిస్తూ ఉండాలి.
కంటి పరీక్ష: ఏడాదికోసారి కంటి పరీక్షలు చేయించాలి. దృష్టిలోపాలు, గ్లకోమా సమస్య ఉన్నట్లయితే చికిత్స తీసుకోవాలి.
డెంటల్ చెకప్: దంత సమస్యలు… గుండె జబ్బులు, షుగర్ వ్యాధికి కారణమవుతాయి. కాబట్టి ఏడాదికి ఒకసారైనా దంత పరీక్షలు చేయించుకోవాలి. పొగాకు, మద్యం, మత్తు పదార్థాల వినియోగం ఉంటే వాటి వల్ల వచ్చే సమస్యలకు కూడా అదనంగా పరీక్షలు చేయించుకోవాలి.