ఇంతి సౌందర్యం ఎంత సుకుమారమో చెప్పడానికి పువ్వులతో పోలుస్తుంటారు కవులు. ‘కుసుమాలు తాకగనే.. నలిగేను కాదా నీ మేను’ అని ఓ సినీకవి అందమైన ప్రయోగమూ చేశాడు. అయితే ఈ పువ్వులు తాకితే.. పడతి సొగసు పదింతలు అవుతుంది. పూలలో ఉండే గుణాలు.. చర్మ సమస్యలను తగ్గిస్తాయి. అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి.
బంతిపూల జానకి: బంతిపూలలో యాంటి సెప్టిక్, యాంటి బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలం. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో అద్భుతంగా పనిచేస్తాయి. బంతిపూలను మెత్తగా రుబ్బుకొని ఒంటికి రాసుకుంటే.. చర్మం తేమగా, కాంతిమంతంగా తయారవుతుంది. ఇక ముఖంపై మొటిమలు, దద్దుర్లు ఉంటే.. బంతిపువ్వు రేకులతో రుద్దేస్తే సరి. ముడతలు, వృద్ధాప్య ఛాయలను తగ్గించడంలోనూ బంతిపూలు సాయపడతాయి.
ముద్దొచ్చే మందారం: జుట్టుకే కాదు.. చర్మాన్ని సంరక్షించడంలోనూ మందారపూలు ముందుంటాయి. వీటిలో యాంటి ఆక్సిడెంట్లు, ఆంథోసైనోసైడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ రంధ్రాలను కాపాడతాయి. మందారపూలు పిగ్మెంటేషన్‌ను నివారిస్తాయి. ఇందులోని ఆస్ట్రింజెంట్ లక్షణాలు.. ముఖంపై జిడ్డు స్రావాలను అడ్డుకుంటాయి. చర్మ రంధ్రాలను బిగుతుగా మారుస్తాయి. వీటిలో లభించే విటమిన్ సి.. చర్మ నిగారింపులో సాయపడుతుంది. మందారపూలతో చేసిన ఫేస్‌ప్యాక్ పెట్టుకుంటే.. అనేక చర్మ సమస్యలు దూరమవుతాయి.
మల్లెపూల మారాణి: సుగంధాలు వెదజల్లడంలోనే కాదు.. చర్మ సంరక్షణలోనూ మల్లెపూలు గొప్పగా పనిచేస్తాయి. ఎండలతో చర్మం కందిపోకుండా కాపాడటంలో, మంట, చికాకును తగ్గించడంలో, మొటిమలు, మచ్చలను నివారించడంలో సాయపడతాయి. వీటిలో ఉండే యాంటి ఆక్సిడెంట్లు.. చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి. ఇవి శరీరాన్ని డిటాక్సిఫై చేయడంలోనూ ఉపకరిస్తాయి. గుప్పెడు మల్లెలను పేస్టులా చేసి.. కొద్దిగా కొబ్బరినూనె కలిపి ముఖానికి ప్యాక్‌గా వేసుకుంటే.. మంచి ప్రయోజనాలు కనిపిస్తాయి. ముఖంపై మొటిమల వల్ల ఏర్పడిన గాయాలపై మల్లెపూలతో రాస్తే.. త్వరగా తగ్గిపోతాయి.