కేజీఎఫ్ సంచలనం. కేజీఎఫ్-2 మహా సంచలనం. రెండో చాప్టర్లో కట్టిపడేసే సన్నివేశాలెన్నో. తొట్టిగ్యాంగ్ పర్ఫార్మెన్స్ అయితే అదుర్స్. ఆ చిచ్చర పిడుగుల గుంపునకు ఓ లీడర్ ఉంటాడు. కళ్లతోనే హావభావాలు పలికిస్తూ కట్టిపడేస్తాడు. ఆ పిల్లగాడే భానుప్రకాశ్.
భానుప్రకాశ్‌కు సినిమాలంటే ఇష్టం. తండ్రి పేరు సురేశ్ అమాస. కొన్ని లఘుచిత్రాలు తీశాడు. వాటిలో ఒక చిత్రంలో చిన్నపిల్లాడి క్యారెక్టర్ కోసం ఎక్కడెక్కడో వెతికినా తగినవాళ్లు దొరకలేదు. విసుగొచ్చి, తన కొడుకుతోనే చేయించాడు. తొలి ప్రయత్నంలోనే యాక్టింగ్, డైలాగ్స్ అదరగొట్టాడు భాను. దీంతో భానులోని మెరుపును గ్రహించాడు సురేశ్. అల్లు శిరీష్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌ల కోసం ప్రయత్నిస్తున్నారని తెలిసి ఆడిషన్స్‌కు తీసుకెళ్లాడు. అలా ‘ఒక్క క్షణం’లో అవకాశం దొరికింది. అల్లు అర్జున్, సమంతతో యాడ్స్‌లోనూ చేశాడు భాను.
‘ఫన్ బకెట్’ వంటి వెబ్ సీరిస్‌లో ప్రతిభను చాటుకున్న భాను ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘వెంకీమామ’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘లవ్‌స్టోరీ’, ‘గమనం’.. ఇలా దాదాపు 30 సినిమాల్లో నటించాడు. తను డబ్బింగ్ కూడా చెప్పుకోగలడు. ఇవన్నీ ఒకెత్తు అయితే, కేజీఎఫ్-2లో అవకాశం మరో ఎత్తు. నటీనటులు, సాంకేతిక వర్గం.. ఎన్నివైపుల నుంచి చూసినా ఆ పాన్ ఇండియా మూవీలో తెలుగు పరిశ్రమకు ఏకైక ప్రతినిధి భాను. ఆడిషన్స్ సమయంలో 20వేల మందితో పోటీపడి తన ప్రత్యేకతను చాటుకొన్నాడు. తననిప్పుడు అంతా ‘చోటా రాకీ’ అనే పిలుస్తున్నారట.
హీరో అవుతా..
కేజీఎఫ్-2 తర్వాత భానుకు అవకాశాలు పెరిగాయి. నాని హీరోగా వస్తున్న ‘అంటే సుందరానికి’తోపాటు అనేక చిత్రాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఆ షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాడు. హైదరాబాద్‌లోని ‘న్యూటన్ టెక్నో హైస్కూల్’లో చదువుతున్న భానుకు పాఠశాల యాజమాన్యం నుంచి కూడా ప్రోత్సాహం లభిస్తున్నది. షూటింగ్‌కు ఆటంకం లేకుండా రెగ్యులర్ అసైన్మెంట్లను ఆన్లైన్ ద్వారా పంపిస్తున్నారు. పెద్దయ్యాక హీరో అవ్వడమే తన లక్ష్యమంటున్న భానుకు మహేశ్‌బాబు, సంతోష్ శోభన్, రానా దగ్గుబాటి అంటే ఇష్టం.