‘నానమ్మ పప్పు కూర వండితే ఎంత కమ్మగా ఉండేదో’, ‘మా అమ్మ చేతి వంట తినాలంటే పెట్టి పుట్టాలి’.. ఇలాంటి మాటలు ప్రతి ఇంట్లో వింటూనే ఉంటాం. ఆ వంటలకు అంత రుచి ఎలా వచ్చిందని అడిగితే మాత్రం సమాధానాలు వేరువేరుగా ఉంటాయి. అవును, హస్తవాసే రుచికి ప్రధాన కారణం. వండిన పాత్రకు కూడా ఆ ఘనతలో వాటా ఇవ్వాల్సిందే. కాబట్టే, ఆరోగ్యాన్ని ప్రసాదించే సంప్రదాయ వంటపాత్రల వ్యాపారంలోకి వచ్చారు కాయల్ విజీ.
కార్పొరేట్ జీవితానికి అలవాటుపడ్డాక.. ఏదిపడితే అది తినడం అలవాటైపోయింది. ఫలితంగా ఆరోగ్యం నాశనమై పోతున్నది. శరీరం రిపేరుకు వస్తున్నది. దీంతో ఆ జీవ యంత్రాన్ని బాగుచేసుకునేందుకే పాత పద్ధతులవైపు పరుగులు తీస్తున్నారు జనం. సరే, ఆహార పదార్థాలను సేంద్రియ పద్ధతిలో పండిస్తాం. వాటిని వండే విధానంలో మార్పు లేకపోతే ఏం లాభం? ఈ ప్రశ్నలోంచి పుట్టిందే ‘ఎసెన్షియల్ ట్రెడిషన్స్’.
‘సంప్రదాయ వంటపాత్రల్లోనే వండుకు తిందాం’ అనే నినాదంతో 2016లో చెన్నైలో ఈ దుకాణాన్ని ప్రారంభించారు కాయల్ విజీ. అంతకు ముందు.. కాయల్ సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, బియ్యం, తృణధాన్యాలు విక్రయించే ఆర్గానిక్ స్టోర్ నడిపేవారు. చెన్నైలో కాయల్ ఆర్గానిక్ స్టోర్‌కు ఇప్పటికీ మంచి పేరుంది. అయితే.. ‘అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో సేంద్రియ పద్ధతిలో పండించి మరీ అమ్ముతున్నాం. అంతవరకు బాగానే ఉంది. కానీ, వారు వండుకుతినే పద్ధతి మాటేమిటి?’ అనే కోణంలో ఆలోచించారు.
‘ఆర్గానిక్ విధానంలో పండించిన పదార్థాలను అదే పద్ధతిలో వండే మార్గమేదైనా ఉందా’ అని అన్వేషించారు. కాయల్కు అద్భుతమైన సమాధానం దొరికింది. మన పూర్వికులు వాడుకున్న పాత్రల్లో వంట చేసుకుంటే కనుక, అనేక లాభాలు చేకూరుతాయని తెలుసుకున్నారు. ఇందుకు తానేం చేయగలననే అంతర్మథనం మొదలైంది. లోతైన అధ్యయనం తర్వాత.. కొన్ని రకాల లోహాలు, మట్టితో చేసిన వంటపాత్రలు ఆరోగ్యాన్ని కాపాడటంతోపాటు సహజంగా కొన్ని మినరల్స్‌ను అందిస్తాయని అర్థమైపోయింది.
వెంటనే.. తన ఆర్గానిక్ స్టోర్‌లో సంప్రదాయ వంటపాత్రలు అమ్మకానికి పెట్టారు విజీ. ఆ వ్యాపారాన్ని విస్తరిస్తూ ‘ఎసెన్షియల్ ట్రెడిషన్స్’ పేరుతో ప్రత్యేక దుకాణం తెరిచారు. ఉక్కు, ఇనుము, రాగి, కంచు, ఇత్తడి, తగరం, చెక్క, మట్టి పాత్రలను జనానికి పరిచయం చేశారు. ఆయా పాత్రల్లో వండుకుని తింటే ఎలాంటి లాభాలు ఉంటాయో కస్టమర్లకు వివరించారు. దీంతో వ్యాపారం పెరిగింది. చెన్నైలోనే మరో రెండు స్టోర్లను ప్రారంభించారు కాయల్.
ఆ తర్వాత బెంగళూరు, హైదరాబాద్‌లలో అడుగుపెట్టారు. స్టోర్ల సంఖ్య పెంచుతున్నప్పుడు ‘ఇంకోసారి ఆలోచించు. ఆర్గానిక్ పద్ధతులను అనుసరించే వారు, సంప్రదాయ పాత్రలు వాడేవారు తక్కువగా ఉంటారు. వ్యాపారంలో నష్టం వస్తుందేమో’ అని హెచ్చరించిన వారూ ఉన్నారు. కానీ.. తన మీద తనకున్న నమ్మకంతో కాయల్ ధైర్యంగా అడుగు ముందుకు వేశారు.
నిత్యం వాడే అల్యూమినియం, స్టీలు పాత్రలకు బదులు.. మన తాతలు, తండ్రుల కాలంలో వాడిన ఐరన్, కాస్ట్ ఐరన్ పాత్రలు వంటకు చాలా మంచివని సూచిస్తారు కాయల్ విజీ. ఈ పాత్రల్లో వండితే.. అందులోని ఐరన్ ఆహార పదార్థాల్లోకి విడుదలై ఒంటికి ఐరన్ అందుతుంది. కాకపోతే.. ఈ లోహపు పాత్రలు మెల్లగా వేడెక్కి, మెల్లగానే చల్లబడుతాయి. అంతేకాదు.. వీటిని మారుతున్న వాతావరణానికి అనుగుణంగా సీజనింగ్ చేయాలి. అంటే.. తుప్పు పట్టకుండా ఆముదం, నూనె వంటివి రుద్ది పక్కన పెట్టాలి. ఇక మట్టిపాత్రల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో వండితే కనుక, ఆహారంలో పోషక విలువలు నశించకుండా ఉంటాయి. రకరకాల మృత్తికలతో చేసి, నిప్పుల్లో కాల్చడం వల్ల మట్టిలోని మినరల్స్ ఆహార పదార్థాల ద్వారా శరీరానికి అందుతాయి. అయితే.. మట్టిపాత్రలు ఎంచుకునేటప్పుడు మెరుస్తున్నవి, నున్నగా ఉన్నవి కాకుండా, గరుకుగా ఉన్నవే ఎంచుకోవాలని సూచిస్తారు కాయల్. ఆమె రాతి పాత్రలనూ విక్రయిస్తారు. ఈ పాత్రల్లో వంట చేయలేం. కానీ నిల్వ ఉంచుకోవచ్చు.
ఆ స్ఫూర్తితోనే ఎసెన్షియల్ ట్రెడిషన్స్ పేరుతో వంటపాత్రలు అందిస్తున్నా. స్పందన బాగుంది. భవిష్యత్తులో హైదరాబాద్‌లో మరిన్ని స్టోర్స్ తెరవాలనుకుంటున్నా. ఆ తర్వాత ఉత్తరాది గురించి ఆలోచిస్తా.
– కాయల్ విజీ, ఎసెన్షియల్ ట్రెడిషన్స్
..? సుంకరి ప్రవీణ్‌కుమార్