తన భర్త, బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్‌ను ఊసరవెల్లితో పోల్చింది సీనియర్ నటి కత్రినా కైఫ్. ఊసరవెల్లి రంగులు మార్చినంత సులువుగా.. విక్కీ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయగలడని ప్రశంసల వర్షం కురిపించింది. విక్కీ కౌశల్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఛావా’.. ఈ శుక్రవారం విడుదలైంది. తాజాగా సినిమాను వీక్షించిన కత్రినా.. ఇన్‌స్టా వేదికగా ప్రత్యేక రివ్యూ ఇచ్చింది. ఇదొక అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్.. శంభాజీ మహరాజ్ గొప్పతనాన్ని గొప్పగా చూపించారంటూ కితాబునిచ్చింది.
‘నాకు ఏం మాట్లాడాలో తెలియడం లేదు. చివరి 40 నిమిషాలైతే ప్రేక్షకులు నోరెళ్లబెట్టి చూస్తారు. సినిమాను మళ్లీ మళ్లీ చూడాలని అనుకుంటారు!’ అంటూ రాసుకొచ్చింది. ఇక ఈ చిత్రంలో విక్కీ నటన గురించి ప్రస్తావిస్తూ.. అతణ్ని సరదాగా ఊసరవెల్లితో పోల్చింది. ‘ఈ సినిమా నాపై చూపిన ప్రభావం మాటల్లో చెప్పలేనిది. విక్కీ.. చాలా అద్భుతంగా చేశావు.
నువ్వు తెరపై కనిపించిన ప్రతిసారీ, ప్రతి షాట్ కూడా అద్భుతం! నిన్నూ, నీ ప్రతిభను చూసి నేను చాలా గర్వపడుతున్నాను’ అంటూ పోస్ట్ చేసింది. ‘ఛావా’ పేరుతో శివాజీ సావంత్ రాసిన మరాఠీ నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో శివాజీ మహరాజ్ తనయుడు శంభాజీ మహరాజ్‌గా విక్కీ కౌశల్ నటించగా, శంభాజీ భార్య యేసుబాయిగా రష్మిక మందన్నా కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా.. మొదటిరోజే 47 కోట్ల కలెక్షన్లు సాధించి, హిట్ టాక్‌తో దూసుకెళ్తున్నది.