పెద్ద నదీతీరంలో ఉన్న ఒక గ్రామాన్ని ఆనుకుని పెద్ద కొండ ఉంది. ఆ కొండపైన విష్ణుమూర్తి గుడి ఉంది. అక్కడికి ఒక గజిబిజి గందరగోళం యువకుడు వచ్చాడు. అతణ్ని ఎలా ఉన్నావని అడిగాడు గుడి పూజారి. తన జీవితంలో ఆనందమే లేదని వాపోయాడు ఆ యువకుడు. అన్నీ తనకు వ్యతిరేకంగానే జరుగుతున్నాయని, సంతోషమే లేదని బాధపడ్డాడు. చాలామందికి పట్టిందల్లా బంగారం అవుతున్నదని, తనకు మాత్రం బంగారం పట్టినా అది పనికి రాకుండా పోతున్నదని ఆవేదన వ్యక్తం చేశాడు.
అంతా విన్న పూజారి ‘కొండ పైకి నడిచి వచ్చావు కదా, దారిలో చెట్టుచేమల్ని చూడలేదా?’ అని అడిగాడు. ‘చుట్టూ చెట్టుచేమలకేమి తక్కువ? అంతా పచ్చగా సస్యశ్యామలంగా ఉంది!’ అని బదులిచ్చాడు యువకుడు. ‘నేను చెప్పినట్లు చేస్తావా?’ అని అడిగాడు పూజారి. కచ్చితంగా చేస్తానన్నాడు యువకుడు. ‘అయితే వచ్చే శనివారం ఒక బియ్యం బస్తాను నెత్తి మీద పెట్టుకుని కొండ ఎక్కి గుడికి తీసుకుని రా! స్వామి వారికి పొంగలి ప్రసాదం చేద్దాం’ అన్నాడు. అలాగేనని చెప్పిన ఆ యువకుడు మరుసటి శనివారం నాడు బియ్యం బస్తాను నెత్తి మీద పెట్టుకుని చెమటలు కక్కుకుంటూ వచ్చాడు. అతడి నెత్తి మీద ఉన్న బరువును దించిన పూజారి ‘దారిలో చెట్టుచేమలు ఎలా ఉన్నాయ’ని అడిగాడు. ‘వాటిని చూసే అవకాశం ఎక్కడ? నెత్తి మీద ఉన్న బరువుతోనే కుస్తీలు పడుతూ ఉంటే…’ అని బాధగా ముఖం పెట్టాడు. ‘అదే.. నేను నీకు చెప్పేది. తలలో అనవసర చెత్తనంతా ఎందుకు పోగు చేసుకుంటావు? ప్రపంచంలో జరిగే విషయాలన్నిటికీ ఎందుకు ప్రాధాన్యమిస్తావు? మన చేతిలో లేని గతం, భవిష్యత్తుల గురించి ఆలోచిస్తూ నీ బుర్రను చెత్త బుట్టలాగా చేసుకుంటే చిన్నచిన్న ఆనందాల్ని, అనుభవాల్ని ఆస్వాదించడం ఎలా సాధ్యమవుతుంది? మొదట వాటిని శుభ్రం చెయ్’ అని వివరించాడు పూజారి. ‘నిజమే… నెత్తి మీద బరువు లేనప్పుడు, ఉన్నప్పుడు చెట్టు చేమలు అలాగే ఉన్నాయి. చూడటంలోనే తేడా’ అని తెలుసుకున్నాడు ఆ యువకుడు. పూజారి చేసిన నేతి మిరియాల పొంగలి ప్రసాదం తింటూ ఉత్సాహంగా కొండ దిగాడు.