ఓ పట్టణంలోని యువకుడు టీచర్ ట్రైనింగ్ కోర్సు పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించాడు. సరైన ఉద్యోగం దొరక్క, నిరాశా నిస్పృహలకు గురయ్యాడు. ఒక రోజు అతను కూరగాయల మార్కెట్‌కి వెళ్లాడు. అక్కడ తనకు చిన్నప్పుడు పాఠాలు చెప్పిన గురువు కనిపించాడు. గౌరవ పూర్వకంగా నమస్కరించాడు. ‘ఎలా ఉన్నావ’ని ప్రశ్నించాడు గురువు. తన జీవితం కష్టాల కొండ అని వాపోయాడు యువకుడు. తనకున్న సమస్యలు ఈ భూలోకంలో మరెవ్వరికీ ఉండవని బాధగా చెప్పాడు.
చిన్న నవ్వు నవ్వాడు గురువు. కొందరు పిల్ల ‘నీకు టీచర్ ఉద్యోగం వచ్చిందనుకో. నువ్వు వెళ్లిన తరగతి గదికి లు వస్తారు. కొందరు రారు. తరగతికి ఎందుకు రాలేదని, రాని వారిని తిట్టగలవా’ అని ప్రశ్నించాడు. ‘కుదరద’ని బదులిచ్చాడు యువకుడు. ‘అప్పుడేమి చేస్తావ’ని అడిగాడు గురువు. ‘వచ్చిన పిల్లలనే, రాని వారి గురించి తిట్టిపోస్తా’నన్నాడు. ‘మరి తరగతికి రాని వారిని ఎప్పుడు తిట్టగలవ’ని మళ్లీ అడిగాడు గురువు. ‘ఆ విద్యార్థులు మళ్లీ తరగతి గదికి వచ్చినప్పుడే అది సాధ్యం. రానివాళ్లని తిట్టే అవకాశమే లేదు కదా’ అన్నాడు యువకుడు. అప్పుడు గురువు అతని భుజం తడుతూ.. ‘అదే నీ విషయంలోనూ జరుగుతున్నది. ఖాళీగా కూర్చున్నవాడికి సమస్యలే రావు. ఏదో ఒకటి చేసే ప్రయత్నంలో ఉన్నావు కాబట్టే నీకు సమస్యలు వస్తున్నాయి. ప్రయత్నించడం మానుకోవద్దు. పడవ ఒడ్డున ఉంటే సమస్యలే ఉండవు. అది సముద్రంలోకి వెళ్లినప్పుడే కదా ఆటుపోట్లకు గురయ్యేది. శిల్పంగా మారబోయే రాయికే ఉలి దెబ్బలు ఎక్కువ తగులుతాయని గుర్తించు. ఎప్పుడో ఒకరోజు అదృష్ట దేవత నీ తలుపు తడుతుంద’ని ధైర్యంచెప్పి, ముందుకు కదిలాడు గురువు. నిజమే, కడలి అన్నాక కెరటాలు, జీవితమన్నాక కష్టసుఖాలు ఉంటాయన్న విషయం గుర్తించాడు యువకుడు. ఓర్పు ఉండాలే కానీ, నత్త కూడా నడుస్తూ కాశీ క్షేత్రానికి వెళ్లగలదని పెద్దలు చెప్పడం గుర్తుకు తెచ్చుకున్నాడు. కష్టపడి చదివాడు. మరుసటి ఏడాదే ఉద్యోగం వచ్చింది. తీపి మిఠాయిలు తీసుకెళ్లి గురువుకిచ్చి ఆశీస్సులు తీసుకున్నాడు.