కష్టసుఖాలు, బాధలు, బాధ్యతలు అన్నీ కలగలసిన అద్భుత ప్రపంచం.. కుటుంబం. భిన్న మనస్తత్వాలు, విభిన్న అభిప్రాయాలు ఉన్నా.. అనుబంధాల ముడితో ఆత్మీయతలు పంచుకునే ఇల్లే నిజమైన బృందావనం. భారతీయ కుటుంబ వ్యవస్థ.. అంతులేని శక్తికి, సమైక్య బలానికి నిదర్శనం. కానీ, ఇదంతా గతం! వర్తమానంలో ఉమ్మడి కుటుంబాలే కాదు చిన్న కుటుంబాలు కూడా ఛిన్నాభిన్నమైపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది.
పిల్లల ఆనందమే.. తమ ఆనందంగా భావించే తల్లిదండ్రులు. కన్నవారి కలలను నెరవేర్చడానికి అహరహం కృషిచేసే బిడ్డలు. ఇంటి పెద్దను గౌరవిస్తూ.. ఆయన మాటే శిరోధార్యంగా ఉండే పెద్దవాళ్లు. అలా.. ఉమ్మడి కుటుంబం అంటేనే సంతోషాల వేదికగా ఉండేది. అయితే, నేటి ఆధునిక సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ.. ఆనవాళ్లు లేకుండా పోయింది. అదంతా.. గతకాలపు ఘనచరిత్రగానే మిగిలిపోయింది. ఉమ్మడి కుటుంబం ఎప్పుడో బీటలువారిపోగా.. చిన్న కుటుంబం కూడా ఛిన్నాభిన్నమవుతున్నది. క్రమంగా కుటుంబ వ్యవస్థ అనేది.. వ్యక్తులుగా విడిపోయి, ఒంటరితనానికి బాటలు వేస్తున్నది.
చిన్నపిల్లల నుంచి టీనేజర్ల దాకా తల్లిదండ్రులతో కలిసే ఉంటున్నా.. స్మార్ట్ఫోన్కే అతుక్కుపోతున్నారు. తెరకే పరిమితమై.. తమతమ గదులకే అంకితం అవుతున్నారు. కాలేజీ స్టూడెంట్స్ మొదలుకొని పెళ్లీడుకొచ్చిన వాళ్లు.. నగరాల్లో ఒంటరిగా ఉంటూ, నానా తంటాలు పడుతున్నారు. ఇక పెళ్లయిన జంటలు.. వెంటనే వేరు కాపురాలు పెడుతున్నారు. మంచీచెడూ చెప్పేవారులేక ఒకరినొకరు అపార్థం చేసుకుంటున్నారు. కొందరైతే ఏకంగా విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. ఒకే ఇంట్లో ఆత్మీయంగా కలిసున్న దంపతులూ.. ఉద్యోగ బాధ్యతల్లో ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఒకరినొకరు పలకరించుకునే సమయం లేకుండా.. కేవలం డబ్బు సంపాదించే యంత్రాలుగా మారిపోయారు. ఇక ఇంటిల్లిపాదికీ మంచీచెడూ చెప్పాల్సిన పెద్దలు ఊళ్లోనో, వృద్ధాశ్రమాల్లోనో భారంగా కాలం గడుపుతున్నారు.
నేటి కుటుంబాల్లో ప్రేమ, ఆత్మీయతలు కరువైపోయాయి. చిన్నచిన్న అపార్థాలతోనే బంధాలు బీటలు వారుతున్నాయి. ఫలితంగా మనుషుల్లో ఒంటరితనం పెరిగిపోతున్నది. యువత వ్యసనాలకు బానిస అవుతున్నది. చెప్పేవారు, పట్టించుకునేవారు లేకపోవడంతో విచ్చలవిడితనం, నేర ప్రవృత్తి పెరిగిపోతున్నది. ఈ నేపథ్యంలో నేటితరానికి కుటుంబం విలువను తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని మానసిక నిపుణులు అంటున్నారు. బలహీనపడుతున్న కుటుంబ వ్యవస్థను పటిష్ఠం చేయాలని స్పష్టం చేస్తున్నారు. కుటుంబ సమైక్యత గురించి ప్రజలందరికీ అవగాహన కల్పించాలని చెబుతున్నారు. కుటుంబంలోని పెద్దల అనుభవాలు, నైపుణ్యాలను పంచుకోవడం, కుటుంబసభ్యుల మధ్య నెలకొన్న విభేదాలను తొలగించి.. ఆయా కుటుంబాలలో సుఖశాంతులు నెలకొల్పడం ద్వారా ‘ఉమ్మడి కుటుంబ వ్యవస్థ’ను మళ్లీ పట్టాలెక్కించవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.