‘చల్లగా తొలివాన నాపైన కురిసింది’ అంటూ మతలా (పల్లవి) అందుకున్నదామె. ఆ సభలో ఆసీనుడైన సినారె ‘చిరుజల్లు చల్లగా నా మనసు తడిసింది’ అన్నట్టుగా తన్మయుడయ్యాడు. ఆయన ప్రశంసలే ప్రేరణగా గజల్ ఆలాపన మొదలుపెట్టింది హిమజా రామం. ‘బలిదానపు తంగేడై పూసిందిలే తెలంగాణ’ అంటూ మొదలుపెట్టి ప్రతి శేర్ (తెలుగులో ద్విపద వంటిది)లో అమరుల్ని స్మరించిన ఆ పాటకు తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కవితక్క ఫిదా అయిపోయారు. ప్రతి వేదికపైనా నీ పాటుంటుందని మాటిచ్చినట్టే తెలంగాణ ఉత్సవాల్లో హిమజ గళం వినిపిస్తున్నది. ప్రతి గజల్కూ తఖల్లుస్ (కవి నామముద్ర) ఉన్నట్టే ఆలాపనలో లలిత సంగీత బాణి ఆమె శైలి!
కవయిత్రి ఇందిర బైరి బిడ్డను నేను. అమ్మ మొదట్లో కవితలు, మినీ కవితలు, నానీలు రాసేది. హైదరాబాద్ వచ్చాక తనకు ‘గజల్’ ప్రక్రియ పరిచయమైంది. గజల్స్ రాయడం నేర్చుకుంది. అనేక అంశాలతో గజల్స్ రాసింది. ఎనిమిదేళ్ల క్రితం అమ్మ రాసిన గజల్ కావ్యం ‘తెలంగాణ’ ఆవిష్కరణ జరిగింది. సినారె గారు వస్తున్నారని ఆ కార్యక్రమానికి వెళ్లాను. ఆ సభలో నన్ను అమ్మ రాసిన ఒక గజల్ పాడమన్నారు. అంతకుముందు దేశభక్తి గీతాలు పాడాను. కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను కాబట్టి ‘చల్లగా తొలి వాన నా పైన కురిసింది… చిరుజల్లు చల్లగా నా మనసు తడిసింది’ అలవోకగా పాడాను. ‘చాలా చక్కగా పాడిందని’ ఆ సభలో సినారె గారు ప్రశంసించారు. సభ తర్వాత ప్రత్యేకంగా అభినందించారు. ‘నువ్వు తెలుగు గజల్స్ పాడొచ్చు. మంచి భవిష్యత్ ఉంటుంది. నేను రాసినవీ ఆలపించు’ అన్నారు.
కొత్తగూడెం సింగరేణి మహిళా కళాశాలలో చదివేటప్పుడు సంగీతం టీచర్ తాడేపల్లి వెంకట పద్మావతి గారి దగ్గర సంగీతంలో బేసిక్స్ నేర్చుకున్నాను. లైట్ మ్యూజిక్‌లో యాభై దాకా దేశభక్తి గీతాలు నేర్పించారు. ఇంటర్, డిగ్రీ చదివే రోజుల్లో కాలేజీ పోటీల్లో చాలా బహుమతులూ గెలిచాను. సినారె గారి ప్రశంసలు ప్రేరణనిచ్చాయి. అప్పటినుంచి గజల్స్ పాడాలని నిశ్చయించుకున్నాను. పండితుల తిట్లు.. పామరుల ప్రశంసలు!
గజల్ ఆలాపనకు వేదికలు తక్కువ. సాంస్కృతిక సంస్థలే అవకాశం ఇస్తాయి. వాటిని పాడినప్పుడు ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువగా ఉండేవి. అమ్మ, చెట్టు, ఊరు, తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వస్తువులుగా ఉన్నవి పాడినందుకు ‘ఇవి గజళ్లా?’ అని నోరు పారేసుకునేవాళ్లు. చాలామంది విమర్శించారు. ‘ప్రేమ, విరహం అంశాలే పాడాలి. అన్ని అంశాలూ ఎలా పాడతారు?’ అని ప్రశ్నించేవాళ్లు. సోషల్ మీడియాలో తిట్లు, విమర్శలు వచ్చేవి. ‘గజల్’ అంటే ప్రియురాలితో సంభాషణ. సినారె గారు దానిని ప్రేమ, విరహం దాటించి కొత్త దారిలో నడిపించారు. తెలుగులో సామాజిక అంశాలను వస్తువులుగా తీసుకుని ప్రయోగం చేశారు. అమ్మ, భాష, తత్వం.. ఇలా ఎన్నో సామాజికాంశాలను కవితా వస్తువులుగా ఎంచుకుని గజల్స్ రాశారు. దానిని ఎంతోమంది కవులు అనుసరించారు. ఆ దారిలో నడుస్తున్నాను. పండితులు, కవులు విమర్శించారు. కానీ, సామాన్యులు మాత్రం ‘భలేగా పాడుతున్నార’ని ఆదరించారు. ప్రేక్షకాదరణ ఉండబట్టే మాకు ఇంకా వేదికలు దొరుకుతున్నాయి.
లలిత సంగీతం బాణిలో గజల్ ఆలపించడం నా శైలి. హిందుస్థానీ సంగీత పద్ధతిలో రాగాలాపనకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే సాహిత్యం తేలిపోతుంది. గజల్ అనేది సాహిత్యం ప్రధానంగా ఉండే గాన ప్రక్రియ. అందుకే లలిత గీతాల్లా పాడటం బాగుంటుంది అనిపించింది. పాడే గజల్ ‘ఎప్పుడు రాశారు? ఎందుకు రాశారు?’ తెలుసుకుని ఆ భావాన్ని రాగాలలోకి తీసుకువస్తాను. లలిత సంగీతంలో భావ వ్యక్తీకరణ ముఖ్యమైనది. అందుకే శ్రోతలు ‘వహ్వా వహ్వా’ అంటున్నారు. తొమ్మిదేళ్లుగా 200కు పైగా వేదికలపై ఆలపించాను. ఈ ప్రయాణంలో నన్ను నేను మెరుగుపర్చుకుంటూనే ఉన్నాను. కర్ణాటక సంగీతం ఎక్కడ ఆపానో.. మళ్లీ అక్కణ్నుంచి మొదలుపెట్టాను. ఓవైపు సంసార బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. పెండ్లయిన పదేండ్ల తర్వాత తెలుగు విశ్వవిద్యాలయంలో లైట్ మ్యూజిక్ డిప్లొమా కోర్సులో చేరి విజయవంతంగా పూర్తిచేశాను.
రవీంద్ర భారతిలో నిర్వహించిన కాళోజీ జయంతి ఉత్సవాల్లో గజల్ పాడేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించింది. ఆ వేదికపై అమ్మ రాసిన ‘బలిదానపు తంగేడై పూసిందిలే తెలంగాణ… దశాబ్దాల చరిత తిరగరాసిందిలే తెలంగాణ’ గజల్ ఆలపించాను. ఆ గజల్ కవితక్కకు బాగా నచ్చింది.
‘తెలంగాణ’ ఆమెకు కానుకగా ఇచ్చాను. అందులోని ప్రతి శేర్లో ఒక్కో అమరవీరుడిని కీర్తించింది అమ్మ. తెలంగాణ జాగృతి నిర్వహించే ప్రతి కార్యక్రమంలో గజల్స్ పాడించాలని కవితక్క నిర్ణయించింది. అప్పటినుంచి ఆ సంస్థ నిర్వహించే ప్రతి కార్యక్రమంలో పాడుతున్నాను. నాకు ఇష్టమైన అంశాలను వస్తువుగా తీసుకుని గజల్ రాయాలని అడిగి మరీ అమ్మతో రాయించుకున్నాను. నా కోసం చాలా రాసిపెట్టింది. పెన్నా శివరామకృష్ణ, లక్ష్మీ రాయవరపు, శ్రీనివాస్ ఈడూరి, ద్యావరి నరేందర్ రెడ్డి, సుబ్రహ్మణ్య శర్మ మొదలైనవాళ్లను అడిగి గజల్స్ రాయించుకున్నాను. గడ్డం శ్యామల, వడ్డేపల్లి కృష్ణ, దాశరథి రాసినవీ పాడుతున్నాను.
నాకు సినారె గారు దైవ సమానులు. ఆయన గజల్స్ ఎన్నో పాడాను. ఇతరుల గజల్స్ కూడా పాడుతున్నాను. సినారె గారు ‘అమ్మ ఒక వైపు… దేవతలంతా ఒకవైపు… నేనొరిగేను అమ్మవైపు’ అన్నారు. ఎంత హృద్యమైన భావనో కదా! సినారె గారి ప్రోత్సాహంతో గజల్స్ పాడుతున్న నన్ను నలుగురికి తెలిసేలా చేసింది జాగృతి వ్యవస్థాపకులు కవితక్క, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారు. 2016 నుంచి తెలంగాణ జాగృతి నిర్వహించే కవి సమ్మేళనాలు, బతుకమ్మ సంబురాలు, కాళోజీ జయంతి ఉత్సవాల్లో ప్రతీసారి పాడటానికి మాకు వేదిక ఇచ్చారు. అమ్మ కాలం చేసిన తర్వాత కవితక్క స్పూర్తితోనే గజల్స్ పాడుతున్నాను. అమ్మ రాసిన వాటితో ‘తెలంగాణ గజళ్లు’ రూపొందించాను. నన్ను ప్రోత్సహించిన కవితక్కే దీనిని ఆవిష్కరించింది. ‘సవ్వడి’ అనే రెండో ఆల్బమ్ తీసుకువచ్చాను. మూడో ఆల్బమ్ ‘వనితాంతరంగం’లో అమ్మ గజళ్లతోపాటు ఇతరులవీ ఉన్నాయి. ఈ ప్రయాణం గజల్స్ అంత మనోహరంగా సాగిపోతుందన్న నమ్మకం ఉంది.