e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 17, 2021
Home జిందగీ షెల్‌ మెహనరంగా!

షెల్‌ మెహనరంగా!

సముద్రతీరాల్లో దొరికే గవ్వలంటే అందరికీ మక్కువే. స్వచ్ఛతకు బ్రాండ్‌ అంబాసిడర్లలా తెల్లగా మెరిసిపోతూ ఉంటాయి. ఆ వంపుసొంపులు సృష్టికర్త డిజైనింగ్‌ నైపుణ్యానికి సాక్ష్యం. ప్రాచీనకాలం నుంచీ అతివల అలంకరణలో ఓ భాగమైన గవ్వలిప్పుడు ఆధునిక హంగులద్దుకొని.. ఫ్యాషన్‌ ప్రపంచంలో హల్‌చల్‌ చేస్తున్నాయి. సంప్రదాయాన్ని, ఆధునికతనూ సమన్వయం చేస్తున్న గవ్వల ఘనత ఏపాటిదో మనమూ చూద్దాం..

ప్రకృతి సృష్టించిన అద్భుతాలు గవ్వలు. ఒక జీవి ప్రాణ రక్షణకోసం విధాత రూపొందించిన కవచం అంత కళాత్మకంగా ఉండటమే ఓ చిత్రం! ఆకృతిని, పరిమాణాన్ని బట్టి గవ్వలు, శంఖాలు, డొల్లలు, డొప్పలుగా వీటిని అభివర్ణిస్తారు. శబ్దం, వర్ణం, రూపం దేనికదే ప్రత్యేకం. ఈ గవ్వలు రకరకాల పరిమాణాలు, రంగులు, ఆకృతుల్లో లభిస్తాయి. గృహాలంకరణలోనూ, శరీరాలంకరణలోనూ ఇవి ప్రాచీన కాలం నుంచీ వినియోగంలో ఉన్నాయి.

- Advertisement -

కొత్త రూపంలో..
ఎన్ని నగలున్నా మగువల మనసెప్పుడూ కొత్తదనంవైపే మొగ్గు చూపుతుంది. కాబట్టే, రకరకాల డిజైన్లు మార్కెట్లో ప్రత్యక్షం అవుతూనే ఉంటాయి. ట్రెండ్‌కు తగ్గట్టు తయారీదారులూ భిన్నమైన నగలను తయారుచేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం బంగారం, వెండి నగల జోరు కాస్త తగ్గింది. రొటీన్‌కు భిన్నంగా, ప్రత్యేకంగా కనిపించే ఆభరణాల హవా నడుస్తున్నది.

లక్ష్మీదేవి రూపంగా..
శ్రీలక్ష్మి సముద్రరాజు గారాలపట్టి. ఆదీవాసీలూ, తీరప్రాంత ప్రజలూ గవ్వలను లక్ష్మీదేవి రూపాలుగా భావిస్తారు. వీటిని ధరించడం అదృష్టానికి సంకేతమనే నమ్మకం వారిలో ఉంది. వీటి శబ్దాన్ని శుభానికి ప్రతీకగా వర్ణిస్తారు. పెంపుడు జంతువుల మెడకు గవ్వలతో అల్లిన నలుపు తాళ్లను కట్టే సంప్రదాయం చాలా గ్రామాల్లో కనిపిస్తుంది. కొన్ని తెగల్లో ప్రత్యేకించి పెండ్లికి గవ్వల నగలు ధరించే సంప్రదాయం ఉంది. సెలబ్రిటీలు కూడా గవ్వలకు వీరాభిమానులే.

ఆధునిక సంప్రదాయం..
సంప్రదాయ దుస్తులపై నప్పేలా సంప్రదాయ నగలనే ధరిస్తారు మహిళలు. వేడుకల్లో సింగారించుకొనేందుకు గవ్వలతో చేసిన హారాలు, బ్రేస్‌లెట్లు, గొలుసులు, ఉంగరాలు కొలువుదీరుతున్నాయి. చీరకట్టుపై హుందాగా ఉండేలా గవ్వలు పొదిగిన రకరకాల హారాలు అందుబాటులో ఉన్నాయి. సన్నగా మెడచుట్టూ ఒదిగిపోయే చోకర్లు, గాజుల దగ్గరనుంచి కాలి పట్టీలవరకు గవ్వలు పొదిగిన ఆభరణాలు మార్కెట్‌ను ఏలేస్తున్నాయి. ‘హ్యాండీక్రాప్‌’్ట ఆభరణాలుగా ప్రత్యేక గుర్తింపును పొందుతున్న ఈ గవ్వల నగలు ట్రెండీగానూ నిలుస్తున్నాయి. కాలేజీలు, ఆఫీసులకు వెళ్ళేవారు రోజూ ధరించవచ్చు. అందుకు వీలుగా ఒకటి లేదా రెండు గవ్వలతో అల్లిన సన్నని గొలుసులు, ఇంపైన బ్రేస్‌లెట్లు, కమ్మలు అందుబాటులో ఉన్నాయి.

ముక్కలతో ముచ్చటగా..
గవ్వలకు రంధ్రాలు చేసి రంగు దారాలతో అల్లిన ఆభరణాలు కూడా వస్తున్నాయి. ఫ్యాబ్రిక్‌, సిల్క్‌, త్రెడ్‌తో జతచేసి కొత్త డిజైన్లను సృష్టిస్తున్నారు. గవ్వలు పొదిగిన చేతి బ్యాగులు, పర్సులు చాలా ఏండ్ల నుంచీ మగువల చేతుల్లో మెదులుతూనే ఉన్నాయి. ధర తక్కువ, మన్నిక ఎక్కువ, ఎటువంటి నిర్వహణ ఖర్చు లేకపోవడంతో గవ్వల నగలంటే మోజు పడుతున్నారు నేటి మహిళలు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana