రెండు వారాల కిందట ఓటీటీలో విడుదలైన చిత్రం ‘జనగణమన’. ‘అయ్యప్పన్ కోషియమ్’ ఫేమ్ పృథ్వీరాజ్ ప్రధాన పాత్రగా తెరకెక్కిన ఈ మలయాళ చిత్రం నెట్‌ఫ్లిక్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నది. ‘దిశ’ ఎన్కౌంటర్ స్ఫూర్తితో తెరకెక్కిన ‘జనగణమన’ కథ, కథనం విమర్శకుల ప్రశంసలు అందుకున్నది. యూనివర్సిటీ ప్రొఫెసర్ అనుమానాస్పద మృతితో కథ మొదలవుతుంది. అత్యాచారం చేసి, సజీవదహనం చేశారన్న వార్తలు దావానలంలా వ్యాపిస్తాయి.
వర్సిటీ విద్యార్థులు ధర్నాకు దిగడం, రోజుల వ్యవధిలోనే పోలీసులు నిందితులను పట్టుకోవడం జరిగిపోతాయి. నిందితులను క్రైమ్ సీన్ రీక్రియేషన్ పేరిట ఎన్కౌంటర్ చేస్తారు పోలీసులు. తప్పుడు ఎన్కౌంటర్ కేసుగా కోర్టు ముందుకు వస్తుంది. తర్వాతే కథ అసలు మలుపు తిరుగుతుంది. లాయర్‌గా సీన్లోకి ఎంటరయ్యే పృథ్వీరాజ్ పాత్ర కథను మరో కోణంలో ఆవిష్కరిస్తుంది. ఇంతకీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? ఒక్కో చిక్కుముడిని విప్పుతూ కథనం సాగుతుంది. ఈ వారం ఓటీటీ హిట్‌గా నిలిచిన ‘జనగణమన’ మీరూ చూసేయండి.