కారు ప్రయాణం కులాసాగా సాగాలంటే.. ఏసీ పక్కాగా పనిచేయాలి. అద్దాలు దించుకుంటే గాలి వస్తుంది కానీ, ఆహ్లాదాన్ని ఇవ్వదు. పైగా.. భీకర శబ్దంతో ప్రయాణం చికాకుగా మారిపోతుంది. అందుకే, కారు ఎక్కీఎక్కగానే.. ఏసీ వేసుకొని జాయ్‌ఫుల్ జర్నీకి శ్రీకారం చుడతారు. అయితే, మనకు చల్లదనాన్ని పంచే ఏసీని సరిగ్గా నిర్వహించడం చాలా అవసరం.
కారు స్టార్ట్ చేయగానే వెంటనే ఏసీ ఆన్ చేయడం సరికాదు. కొత్త కారైతే పర్వాలేదు కానీ.. కాస్త పాత మోడల్ అయితే, ఇంజిన్‌పై భారం పడొచ్చు. జర్నీ మొదలయ్యాక ఐదు నిమిషాలకు ఆన్ చేయడం మంచిది.
ఒకసారి ఏసీ వేసి.. మళ్లీ కారు ఆగే వరకూ ఆఫ్ చేసేది లేదు అనుకోవద్దు. గంట తర్వాత కొన్ని నిమిషాలపాటు ఏసీ ఆఫ్ చేయడం వల్ల లైఫ్ బాగుంటుంది. ఇది ఏసీ సిస్టమ్ లూబ్రికేషన్‌కు సాయపడుతుంది.
ఏసీ ఫిల్టర్‌ను శుభ్రం చేయడం మర్చిపోవద్దు. ప్రతి 15వేల కిలోమీటర్లకు ఒకసారి ఏసీ ఫిల్టర్స్‌ను శుభ్రం చేయాలి. లేకపోతే గాలి ప్రవాహం మందగిస్తుంది. ఏసీ సామర్థ్యాన్ని కోల్పోతుంది.
క్లియర్ కండెన్సర్, ఎవాపరేటర్లలో చెత్త లేకుండా చెక్ చేసుకోవాలి. దుమ్ము పేరుకుపోతే.. ఏసీ పనితీరుపై ప్రభావం పడుతుంది. ఏసీ గ్రిల్స్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం వల్ల.. ఎలాంటి అడ్డంకులు లేకుండా విస్తారంగా గాలి రావడానికి ఆస్కారం ఉంటుంది.
కారు డాష్బోర్డ్తోపాటు, ఏసీ ఫిల్టర్స్‌లో దుమ్ము, ధూళి, ఇతర హానికారక పదార్థాలు ఉన్నట్టయితే.. ఏసీ వేయగానే క్యాబిన్ అంతా దుర్వాసన వచ్చే అవకాశం ఉంది. కారు ఏసీ ఫిల్టర్లు గ్యాస్, ఇతర ఘాటైన వాసనలను నిరోధించగలిగేంత బలంగా ఉండవు. మీ వాహనం గ్యాస్ లీక్ చేస్తున్నట్టయితే, ఏసీ ద్వారా అది కారు క్యాబిన్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. గ్యాస్ లీక్ కావడం ప్రమాదకరం. అలాంటి వాసన వస్తే.. వెంటనే ఏసీ ఆఫ్ చేయాలి. సాధారణ మెకానిక్‌ను సంప్రదించడం కన్నా.. ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్లో చూపించడం మంచిది.
ఏసీ వేశాక కూడా.. చల్లబడకపోయినా, ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పులు కలిగినా, అసాధారణమైన శబ్దాలు వచ్చినా.. వెంటనే మెకానిక్‌ను సంప్రదించడం అవసరం. నిర్లక్ష్యం చేస్తే వంద రూపాయలతో పోయేది వేలకు పెరగొచ్చు.
ప్రయాణాల్లో ఉన్నప్పుడు, మిగతా సమయాల్లోనూ కారును మండుటెండలో కాకుండా.. నీడ పట్టున పార్క్ చేయడం అవసరం. ఇది ఏసీ పనితీరును మెరుగుపరుస్తుంది.