యష్‌రాజ్ ఫిల్మ్స్ సీరియర్ కాస్టింగ్ డైరెక్టర్ షానూ శర్మ.. తన ఆత్మవిశ్వాసంపై దెబ్బ కొట్టిందంటూ మీర్జాపూర్ నటి ఇషా తల్వార్ ఆరోపిస్తున్నది. ఆడిషన్స్ సందర్భంగా తనను ఇబ్బంది పెట్టేలా వ్యవహరించిందంటూ చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించి.. తన అనుభవాన్ని ‘ఇన్‌స్టా’లో పంచుకున్నది.
షానూ శర్మ.. ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్‌లో సీనియర్ కాస్టింగ్ డైరెక్టర్‌గా చాలా ఏళ్లుగా
పనిచేస్తున్నది. ఎంతోమంది కొత్తవారి ప్రతిభను వెలికితీసి.. బీటౌన్‌కు అందించింది. రణ్వీర్ సింగ్, అనుష్క శర్మ, భూమి పెడ్నేకర్ లాంటి సీనియర్ నటులను బాలీవుడ్‌కు పరిచయం చేసింది. తాజాగా, ‘సయ్యార’ స్టార్లు అహాన్ పాండే, అనీత్ పడ్డాలనూ వెలుగులోకి తీసుకొచ్చింది. అయితే, తన విషయంలో మాత్రం షానూ శర్మ నెగెటివ్‌గా ప్రవర్తించిందంటూ ఇషా తల్వార్ చెబుతున్నది.
‘ఒక సినిమాకు సంబంధించి.. షానూ శర్మ నాకు ఆడిషన్ నిర్వహించింది. స్టూడియోలో కాకుండా.. ముంబయి వెర్సోవాలోని ‘మియా కుసినా’ రెస్టారెంట్లో ఆ ఆడిషన్ జరిగింది. ఎప్పుడూ బిజీగా ఉండే ఆ రెస్టారెంట్లో కూర్చొని.. నా టేబుల్ చుట్టూ కస్టమర్లు భోజనం చేస్తున్నప్పుడు ‘ఏడుస్తున్న సన్నివేశం’లో నటించాలని షానూ నాతో చెప్పింది’ అంటూ ఇషా తల్వార్ ‘ఇన్‌స్టా’లో రాసుకొచ్చింది. అంతేకాకుండా.. ఒక నటికి ఎటువంటి అభ్యంతరాలు ఉండకూడదనీ, అందుకే.. ఇలాంటి వాతావరణంలో నటించి చూపించాలని షానూ చెప్పిందట.
‘ఆమె మాటలు నాకు గందరగోళంగా, వింతగా అనిపించాయి. ఒక సీనియర్ కాస్టింగ్ డైరెక్టర్.. ఒక కొత్త నటితో ఇలా ఎందుకు వ్యవహరించిందో నాకు అర్థం కాలేదు’ అంటూ చెప్పుకొచ్చింది. కొత్తవారికి నిజమైన లొకేషన్లోనే ఆడిషన్ చేయాలనుకుంటే.. ఆ లొకేషన్‌ను సినిమా బృందం అధీనంలోకి తెచ్చుకోవాలనీ, చుట్టూ జూనియర్ ఆర్టిస్టులు, సినిమా క్రూ ఉండేలా చూసుకోవాలని అంటున్నది. అయితే, సినిమాకు సంబంధం లేనివాళ్ల మధ్య.. ఓ హోటల్లో ఆడిషన్ నిర్వహించడం వల్ల తన ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నదనీ, తాను ఆడిషన్లో పాల్గొనలేక పోయానని వాపోయింది.