చాలామంది పిజ్జా, బర్గర్లను జంక్‌ఫుడ్ కిందజమకడుతుంటారు. బర్గర్లో కూరగాయల ముక్కలు, బ్రెడ్, కొంచెం చీజ్ మాత్రమే ఉంటాయి కదా… నిజంగా ఇది జంక్ ఫుడ్ కిందకే వస్తుందా? ఆరోగ్యానికి మంచిది కాదా?
బర్గర్లో బన్, కూరగాయల ముక్కలు, మయోనీజ్, సాస్‌లు ఉంటాయి. ఇందులో బన్ను మైదాతో చేస్తారు. కాబట్టి అందులో పోషకాలు ఏమీ ఉండవు. ఇక, మయోనీజ్లో అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు గుడ్డుతో చేసినప్పటికీ అందులోనూ సంతృప్త కొవ్వులు (శాచురేటెడ్ ఫ్యాట్స్) ఎక్కువగా ఉంటాయి. ఇవి కూడా ఆరోగ్యానికి మంచివి కావు. ఇక, మనం మంచివిగా చెప్పుకొనే కూరగాయల ముక్కలు మొత్తం బర్గర్ పరిమాణంతో పోలిస్తే 10 శాతం మాత్రమే. అంతేకాదు, వాటితోపాటు అందులో ఉండే పొటాటో టిక్కీ, వెజ్ టిక్కీలు, ఒకవేళ నాన్‌వెజ్ బర్గర్ అయితే చికెన్ పాటీస్లాంటివి డీప్ ఫ్రై చేసిన వంటకాలే! అంటే నూనెలో ముంచి తీసే ఇవి కూడా శరీరానికి ఏమంత మంచివి కావు. కాబట్టి ఇందులో 10 శాతం మినహాయిస్తే, బర్గర్‌ని పోషక విలువలు లేని ఫుడ్‌గానే చెప్పాలి.
బర్గర్‌ను అటు రుచికరంగానూ, ఇటు ఆరోగ్యానికి మేలుచేసేదిగానూ మనం తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం, బన్ని ముడి గోధుమపిండి (హోల్ వీట్ ఫ్లోర్)తో గానీ, రాగులు, ఓట్స్, గోధుమల లాంటి వాటిని కలిపి చేసే మల్టీగ్రెయిన్ ఆటాతో గానీ చేసుకోవచ్చు. మసూర్ దాల్‌ను నానబెట్టి కూడా బన్ని చేస్తున్నారు. గోధుమపిండిని ప్రత్యేక పద్ధతుల్లో పులియబెట్టి సాడౌను చేస్తున్నారు. దీంతోనూ బన్ బాగుంటుంది. వీటితో మైదా సమస్య ఉండదు. ఇంట్లో చేసిన పుదీనా చట్నీని సాస్‌ల మాదిరి వాడొచ్చు. హంగ్ కర్డ్‌లో సాల్ట్ పెప్పర్ చాట్ మసాలా కలుపుకొంటే మయోనీజ్ బదులుగా పనికొస్తుంది. ఆలుగడ్డ ఉడకబెట్టి తక్కువ నూనెతో షాలో ఫ్రై చేసిగానీ, ఓవెన్లో టిక్కీలాగా చేసుకొనిగానీ వాడుకోవచ్చు. మాంసాహారులైతే చికెన్ ఉడికించి, దాన్ని షాలో ఫ్రైలాగా చేసి పెట్టుకోవాలి. నచ్చిన కూరగాయల ముక్కలను పొడవుగా తరిగి బర్గర్ తయారు చేసుకుంటే సరి. అయితే ఇలా చేసినా కూడా ఇందులో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి డయాబెటిస్, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్లు ఎప్పుడో ఒకసారి మినహాయిస్తే, తరచూ తినకపోవడమే మంచిది.
– మయూరి ఆవుల, న్యూట్రిషనిస్ట్
Mayuri.trudiet@gmail.com