ఉద్యోగాలు, ఇతర పనులు చేసుకునే మహిళలను రక్తహీనత పట్టిపీడిస్తున్నదని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయితే, ఈ సమస్య చాలా తక్కువగా బయటపడుతున్నదనీ.. దాంతో, ఆరోగ్యనష్టం ఎక్కువగా జరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉన్నదని చెబుతున్నాయి.
పనిచేసే మహిళలు.. ఇటు ఇల్లు, అటు ఆఫీస్ పనులతో సతమతమవుతూ ఉంటారు. గృహిణిగా, ఉద్యోగినిగా.. రెండు పాత్రలనూ సమతుల్యం చేయడంలో తలమునకలై ఉంటారు. ఫలితంగా, తమ ఆరోగ్యంపై శ్రద్ధ తగ్గుతుంది. సమయానికి ఆహారం తీసుకోలేకపోవడం, వ్యాయామానికి తగినంత సమయం లేకపోవడం.. ఇతరత్రా కారణాల వల్ల వారిలో రక్తహీనత సమస్య పెరిగిపోతున్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 కోట్ల మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. అలసట, బలహీనత, తలతిరగడం, తలనొప్పి, గుండెలో దడ ఇతర సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వీరిలో ఉద్యోగినులు, చిన్నచిన్న పనులు చేసుకునేవారే ఎక్కువ.
భారతీయ సంప్రదాయ ఆహారం రుచికరంగా, వైవిధ్యంగా ఉన్నప్పటికీ.. వాటినుంచి శరీరానికి కావాల్సినంత ఐరన్ లభించడం లేదు. చాలామంది యువతులు.. మాంసాహారం, పౌల్ట్రీ, చేపలు తినడానికి ఆసక్తి చూపడంలేదు. ఐరన్ అధికంగా లభించే కూరగాయలు, ఆకుకూరలను తక్కువగా తీసుకోవడం కూడా వారిలో ఐరన్ లోపానికి దారితీస్తున్నది.
సాధారణంగా 24 ఏండ్ల నుంచి 55 ఏండ్ల మహిళలు ఎక్కువగా ఉద్యోగాలు చేస్తుంటారు. వీరంతా ప్రతి రుతుచక్రంలో 30 నుంచి 40 మిల్లీలీటర్ల రక్తాన్ని కోల్పోతారు. ఇది నెలకు 15 నుంచి 20 మిల్లీగ్రాముల ఐరన్ నష్టానికి సమానం. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న సందర్భాల్లో కొందరు తీవ్ర రక్తస్రావానికి గురవుతారు. ఆ సమయంలో 80 మిల్లీలీటర్ల కంటే ఎక్కువ రక్తాన్ని కోల్పోతారు. విటమిన్ బి12, ఫోలేట్ లోపం కూడా.. మహిళల్లో రక్తహీనతకు కారణం అవుతున్నది.
ఐరన్ లోపంతోపాటు రక్తహీనతనూ నివారించడానికి మహిళలు తమ జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. మాంసం, చికెన్, చేపలు లాంటివి రెగ్యులర్గా తీసుకోవాలి. ఇక శాకాహారులైతే.. బీన్స్, కాయధాన్యాలు, టోఫు, పాలకూరతోపాటు బలవర్ధకమైన తృణధాన్యాలను ఆశ్రయించాలి. అదే సమయంలో విటమిన్ సి అధికంగా ఉండే సిట్రస్ పండ్లు, టమాటాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. భోజన సమయంలో టీ, కాఫీలు తాగడం తగ్గించాలి. అధిక రుతు రక్తస్రావం ఉన్నట్టయితే.. డాక్టర్ సలహా మేరకు ఐరన్ సప్లిమెంట్లు తీసుకోవాలి. వీటితోపాటు రెగ్యులర్గా వ్యాయామం చేయడంతోపాటు ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం, యోగాలాంటివి నిత్యకృత్యంగా మార్చుకోవాలి. ఆఫీస్కు వెళ్లేటప్పడు ఐరన్ అధికంగా లభించే భోజనంతోపాటు స్నాక్స్ కూడా తీసుకెళ్లాలి. లోపాలను ముందుగానే గుర్తించడానికి.. క్రమం తప్పకుండా హిమోగ్లోబిన్, ఐరన్ పరీక్షలు చేయించుకోవాలి.