పరుగు పందెంలో పతకాలు గెలిచినవాళ్లను చూశాం. కానీ, పందెంలేని పరుగులో పోలీస్ ఆఫీసర్ అపర్ణ లవకుమార్ నెటిజన్ల మనసు గెలిచింది. సాధారణంగా రద్దీగా ఉన్న రహదారిపైకి అంబులెన్స్ వస్తే పోలీసులు వెంటనే స్పందిస్తారు. అంబులెన్స్‌కు దారి ఇవ్వడం కోసం సిగ్నల్స్ మారుస్తారు. కేరళలోని త్రిసూర్‌లో ఓ అంబులెన్స్ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. సిగ్నల్స్ మార్చినా పని జరగదు అనుకుంది అక్కడే ఉన్న అపర్ణ. ప్రాణం విలువ, కాలం విలువ తెలిసిన ఆమె అంబులెన్స్ ముందు పరిగెడుతూ.. రూట్ క్లియర్ చేసిన వైనం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది. ఆమె చూపిన చొరవకు నెటిజన్లు హ్యాట్సాఫ్ అపర్ణ అంటున్నారు.
సహాయం అపర్ణ ఆటిట్యూడ్! ఆరేళ్ల క్రితం ఇరింజాలకూడ మహిళా పోలీస్ స్టేషన్లో అపర్ణ లవకుమార్ సీనియర్ సివిల్ పోలీస్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తూ ఉండేది. రోజూలాగే ఆమె స్టేషన్‌కు వచ్చింది. ఆమెను చూసి అక్కడివారంతా ఆశ్చర్యపోయారు. పొడవైన జుట్టుతో ఉండే అపర్ణ.. ఒక్కసారిగా బోడితలతో కనిపించింది. క్యాన్సర్ బాధితుల కోసం తల వెంట్రుకలు ఇచ్చేసింది.
‘ మూడేళ్ల క్రితం క్యాన్సర్ బారినపడిన పేద పిల్లల్ని చూశాను. విగ్గు కొనుక్కోలని స్థితిలో ఉన్న వాళ్లను చూసి జాలేసింది. వాళ్లకు కాస్త సంతోషపెట్టాలని ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని అపర్ణ సంతోషంగా చెప్పుకొచ్చింది. ఆమెకు ఇద్దరు బిడ్డలున్నారు. వాళ్లు కూడా అమ్మనే అనుసరిస్తూ క్యాన్సర్ బాధితుల కోసం విరాళాలు సేకరిస్తున్నారు. గతంలో ఓ మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది.
హాస్పిటల్ బిల్లు చెల్లించలేని స్థితిలో ఉన్న మృతురాలి కుటుంబసభ్యుల పరిస్థితి అర్థం చేసుకుంది అపర్ణ. తన చేతికి ఉన్న బంగారు బ్రేస్‌లెట్‌ని అమ్మి అప్పటికప్పుడు రూ.50వేలు సాయం చేసింది. ‘సాయం చేయడం నా నైజం.. సేవ చేయడం నా ఇజం’ అంటున్న అపర్ణ తాజాగా మరోసారి అందరి మనసులూ చూరగొన్నది.