హ్యాండ్ బ్యాగ్ అంటే ఇప్పుడు అవసరానికి వాడుకునేది మాత్రమే కాదు అభిరుచిని తెలియజేసేది కూడా. అందుకే వీటిలోనూ ఎన్నో వెరైటీలు తయారవుతున్నాయి. విభిన్న ఆకృతుల్లో కనువిందు చేస్తున్నాయి. సాధారణ హ్యాండ్ బ్యాగులకు బదులుగా క్రియేటివిటీకి ప్రాధాన్యం ఇస్తున్న ఈ కాలంలో ప్యాలెట్ షేప్డ్ హ్యాండ్ బ్యాగులు కొత్త ఒరవడి సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా కళను ప్రేమించే వారిని ఇవి ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. పెయింటింగ్ చేసేందుకు ఉపయోగించే రంగుల ప్యాలెట్‌ను పోలి వీటిని డిజైన్ చేస్తున్నారు.

ఉడ్ ఫినిష్, లెదర్, ప్లాస్టిక్, రెజిన్ వంటి మెటీరియల్స్‌తో ఇవి తయారవుతున్నాయి. ఈ తరహా బ్యాగులపై రంగుల బొట్లు, బ్రష్ స్ట్రోక్స్, మినీ బ్రష్ డిజైన్స్ లాంటివి ఉంటాయి. దీంతో ఇవి చూడగానే ఒక చిన్న ఆర్ట్ పీస్‌లా కనిపిస్తాయి. ఆన్‌లైన్‌తో పాటు ఆర్ట్ ఫెయిర్స్లో కూడా ఇవి అందుబాటులో ఉంటున్నాయి. అంతేకాదు నచ్చిన రంగులు ఎంచుకునేలా కస్టమ్ డిజైన్స్ కూడా ఆఫర్ చేస్తున్నాయి కొన్ని ప్లాట్‌ఫామ్‌లు. కాబట్టి ఫ్యాషన్‌లో ప్రయోగాలు చేయాలనుకునే ఎవరికైనా ఇవి వావ్ సెలక్షనే!