బంగారు నగలు లేకుండా పెళ్లి లేదు. పేరంటం లేదు. అయితే పుత్తడి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అయినా సరే కొనాల్సిందే. పెళ్లి చేయాల్సిందే కదా! అందని బంగారాన్ని అందుకోవడం అందరికీ సాధ్యం కాదు. కాబట్టి నగలు లేకుండా వెలవెలబోకుండా వెర్మే నగలు వేసుకుంటే బంగారు ధగధగలతో మెరిసిపోవచ్చు. ఈ నగలూ అచ్చం బంగారంతో చేసినవే! ఇత్తడి మీద పుత్తడి పూసి అమ్మే నగలు అనుకుని చాలామంది వీటిని పట్టించుకోరు. వెర్మే నగల తయారీలో 925 స్టెర్లింగ్ వెండిని (బేస్ మెటల్)తో ఆభరణాలకు రూపు ఇస్తారు. ఆ తర్వాత దానిపై 2.5 మైక్రాన్ల మందం ఉండేలా బంగారు పూత వేస్తారు. ఈ పూత… వెండితో బలంగా అంటుకుపోయి ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఇది పూర్తి బంగారం కాదని మనం చెబితే గాని ఇతరులకు తెలియదు.
సాధారణ నగలు వివిధ క్యారెట్ల బంగారంతో చేయించుకున్నట్టే ఈ బంగారు పూతలో 10, 14, 18 క్యారెట్ల బంగారాన్ని ఉపయోగిస్తారు. కానీ బేస్ మెటల్లో స్టెర్లింగ్ వెండిలో మాత్రం మరో లోహం కలపరు. ఆభరణాలు చేయించుకునేవాళ్లు స్తోమతను బట్టి బంగారు నాణ్యతను ఎంచుకోవచ్చు. వెండి, బంగారు మిశ్రమం అయిన వెర్మే నగల ధరలు బంగారు నగలతో పోల్చితే చాలా తక్కువగా ఉంటాయి. మార్కెట్లో బంగారంతో ఎన్ని రకాల ఆభరణాలు ఉన్నాయో, వెర్మేతో తయారైన నగల్లోనూ అన్ని రకాలున్నాయి. కాకపోతే అన్ని పట్టణాల్లోనూ వీటి తయారీ, విక్రయాలు లేవు. ఆన్లైన్లో అనేక ఈ కామర్స్ సైట్లలో ఇవి అందుబాటులో ఉన్నాయి. వెర్మే ఆభరణాలు ధరించేవాళ్లు పెర్ఫ్యూమ్లు, లోషన్ల విషయంలో జాగ్రత్తలు పాటిస్తే మెరుపు ఎక్కువకాలం ఉంటుంది. వీటిని తిరిగి తీసుకుంటామనే హామీతో అమ్మే సంస్థలూ ఉన్నాయి.