భారతీయ కల్ట్ క్లాసిక్ చిత్రాల్లో.. ‘షోలే’ ముందు వరుసలో ఉంటుంది. ఆగస్టు 15, 1975న విడుదలైన ఈ చిత్రం.. 50 ఏళ్ల వేడుకను జరుపుకొంటున్నది. ఈ సందర్భంగా సినిమా దర్శకుడు రమేశ్ సిప్పీ.. ‘షోలే’ తొలినాళ్ల ముచ్చట్లు, తెరవెనక సంగతులను పంచుకున్నాడు. తాజాగా, ఓ జాతీయ చానల్‌తో మాట్లాడుతూ.. సినిమా ప్రదర్శన సందర్భంగా ఎదురైన అనుభవాలను వెల్లడించాడు.
ఎన్నో ఇబ్బందులకు ఓర్చుకొని.. షోలే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చామని దర్శకుడు రమేశ్ సిప్పీ చెప్పుకొచ్చాడు. “ముంబయిలోని ఐకానిక్ మినర్వా థియేటర్లో ఈ చిత్రం తొలి ప్రీమియర్ ఏర్పాటుచేశారు. ఉన్నట్టుండి స్క్రీన్ ఆఫ్ అయిపోయింది. ఆడియో మాత్రం ప్లే అవుతూనే ఉంది. అయినప్పటికీ.. ప్రేక్షకులంతా సినిమాలోనే పూర్తిగా మునిగిపోయారు. తెరపై నటీనటులు కనిపించకున్నా.. వారి సంభాషణలను శ్రద్ధగా విన్నారు” అంటూ నాటి సంగతులను గుర్తుచేసుకున్నాడు రమేశ్ సిప్పి. ఆ తర్వాత ఈ సంఘటన గురించి ఆరా తీయగా.. ప్రొజెక్టర్ కార్బన్‌ను సకాలంలో మార్చడం లేదనీ, దాంతో తరచుగా బ్లాక్ అవుట్లు వస్తున్నాయనీ తెలిసిందట.
అయితే, సినిమా ప్రదర్శనల్లో అంతరాయం కలగకుండా ఉండటానికి.. సిప్పీనే థియేటర్‌కి వెళ్లి తాజా కార్బన్‌ను అందించే బాధ్యత తీసుకున్నాడట. “నేనే స్వయంగా ప్రతిరోజూ థియేటర్‌కి వెళ్లి.. కార్బన్‌ను అందించి వచ్చేవాణ్ని. సినిమాలో అంతరాయం వల్ల.. ప్రేక్షకులు ఇబ్బంది పడకూడదు కదా!” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక సినిమా రన్‌టైమ్, బాక్సాఫీస్ కలెక్షన్లపైనా సిప్పీ చర్చించాడు. ఈ సినిమా విడుదల సమయంలో దేశంలో ఎమర్జెన్సీ నడుస్తున్నది. షెడ్యూల్ ప్రకారం మొదటి స్క్రీనింగ్ ఉదయం 9 గంటలకు ప్రారంభమై.. రాత్రి షోలు అర్ధరాత్రిలోగా ముగియాల్సి ఉంటుంది. అయితే, సినిమా రన్‌టైమ్ 3 గంటల 24 నిమిషాలు ఉండటంలో.. సమయానికి నాలుగు షోలు ముగిసేవి కాదట.
దాంతో, గత్యంతరం లేక సినిమా నుండి 20 నిమిషాలు తగ్గించారట. “అదో కఠినమైన నిర్ణయం. సినిమా నుంచి కామెడీ ట్రాక్‌లను తొలగించాల్సి వచ్చింది. అయితే, ఇది ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. దాంతో బాక్సాఫీస్ కలెక్షన్లపై ప్రభావం పడుతుందని భయపడ్డాం. కానీ, అలా జరగలేదు. షోలేకు రిపీటెడ్ ఆడియెన్స్ ఎక్కువగా వచ్చారు. వాళ్లంతా కట్ చేసిన సీన్స్ తిరిగి పెట్టాలని డిమాండ్ చేసేవారు” అంటూ వెల్లడించాడు. ఇక అమితాబ్ బచ్చన్-ధర్మేంద్ర, హేమ మాలిని, జయ బచ్చన్, సంజీవ్ కుమార్ వంటి దిగ్గజాలు నటించిన ‘షోలే’ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా.. గబ్బర్ సింగ్ (విలన్)గా చేసిన అమ్జద్ ఖాన్ తొలి సినిమాతోనే బాలీవుడ్లో తిరుగులేని విలన్‌గా సెటిలయ్యాడు.