2026లో వాతావరణం.. సాధారణం కంటే అధిక వేడిగా ఉంటుందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తున్నది. ఈ క్రమంలో వడగాలుల ప్రభావం కూడా ఎక్కువే ఉండనున్నది. అయితే, వేడి గాలులు కిడ్నీల ఆరోగ్యాన్ని దెబ్బతీయస్తాయని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ పరిశోధకులు.. 2023లో ప్రపంచవ్యాప్తంగా 78.8 కోట్ల మంది దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులతో బాధపడుతున్నారని తేల్చింది. మన దేశం విషయానికి వస్తే.. 13.8 కోట్ల మందిలో కిడ్నీ సమస్యలు ఉన్నాయట. ఈ క్రమంలో హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్.. మూత్రపిండాల ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం అవుతున్నది.
మన శరీరంలో కిడ్నీలు చాలా కీలకమైన పనులు నిర్వహిస్తాయి. రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా, శరీర సమతుల్యతను కాపాడతాయి. రక్తం నుంచి వ్యర్థ పదార్థాలను బయటికి పంపిస్తాయి. శరీరంలో నీటి శాతాన్ని క్రమబద్ధీకరిస్తాయి. రక్తపోటు నియంత్రణ, ఎముకల ఆరోగ్యం, ఎర్రరక్త కణాల ఉత్పత్తిలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. అయితే, తీవ్రమైన వేడి.. సున్నితమైన కిడ్నీల వ్యవస్థను గందరగోళంలోకి నెట్టేస్తుంది. ఫలితంగా, మూత్రపిండాల పనితీరు మందగించి.. ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇటీవలి కొన్ని అధ్యయనాలు బహిరంగ కార్మికులలో అధిక శాతం మంది దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించాయి. ఎక్కువ సమయంపాటు వేడికి గురవ్వడం, ఒత్తిడితోపాటు రీహైడ్రేషన్ లేకపోవడమే వారిలో కిడ్నీల సమస్యకు కారణమని నిపుణులు వెల్లడించారు. కాబట్టి, ఎండలు ముదరక ముందే.. కిడ్నీలను కాపాడుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.