చిత్రా బెనర్జీ దివాకరుని.. ఇండో అమెరికన్ రచయిత్రి. ఇంటిపేరును బట్టి తెలుగు మూలాలు తెలుస్తున్నాయి. చిత్ర రచనల్లో స్త్రీవాదం అంతర్లీనం. సీత, సావిత్రి, ద్రౌపది.. అద్దాల బందిఖానాను బద్దలుకొట్టుకొని వచ్చి మరీ మనసు విప్పి మాట్లాడతారు. పురుషాధిక్యాన్ని ప్రశ్నిస్తారు, నిలదీస్తారు, నిప్పుతో కడిగేస్తారు. ‘ఇండిపెండెన్స్: ఎ నావెల్’ చిత్రా బెనర్జీ తాజా రచన. స్వాతంత్య్రం-దేశ విభజన నేపథ్యంలో సాగే ముగ్గురు అక్కాచెల్లెళ్ల కథ ఇది.
అప్పటి పరిస్థితులను మహిళల కోణంలో వివరించేందుకు కాల్పనిక సాహిత్యాన్ని మాధ్యమంగా ఎంచుకున్నారామె. ‘పాత పత్రికలు, అమ్మమ్మ-నానమ్మ చెప్పిన కథలు, అప్పటి జానపదాలు, పాత డైరీలు నాకెంతో ఉపయోగపడ్డాయి. ఆ ఘట్టాల్లోకి నా పాత్రలను జొప్పించానంతే. మహిళల కథలను మహిళల కోణంలో చెప్పడానికే ఈ ప్రయత్నమంతా. ఇప్పటి వరకూ ప్రతి కథా పురుషుడి కోణంలోనే సాగింది. ఆ లోపాన్ని సరిచేయాలన్నదే నా ఉద్దేశం. మరికొందరు మహిళా రచయితలు రావాలి, మరింతమంది మహిళా పాఠకులు పెరగాలి. ఇప్పటికే రాస్తున్న మహిళలకు ఇంకొంత గుర్తింపు రావాలి. అంతెందుకు, పది బెస్ట్ సెల్లర్స్ తీసుకుంటే.. అందులో ఏడు పురుషుల రచనలే’ అంటున్నప్పుడు చిత్ర గొంతులో తీవ్ర నిరసన ధ్వనిస్తుంది.