నిన్నటి కన్నా.. మెరుగవ్వాలంటే!
తదున్నసం పాండుర దంత మవ్రణం శుచిస్మితం పద్మ ఫలాశలోచనమ్ ద్రక్ష్యే తదార్యా వదనం కదాస్వహం ప్రసన్నతారాధిప తుల్య దర్శనమ్
తదున్నసం పాండుర దంత మవ్రణం శుచిస్మితం పద్మ ఫలాశలోచనమ్ ద్రక్ష్యే తదార్యా వదనం కదాస్వహం ప్రసన్నతారాధిప తుల్య దర్శనమ్
(సుందరకాండ 13-68)
ఆంజనేయుడు సీతాన్వేషణే లక్ష్యంగా లంక నగరాన్నంతా గాలిస్తున్నాడు. ఆమె ఎలా ఉంటుందో హనుమకు తెలియదు. కాకపోతే, రాముడు సీతావియోగ దుఃఖంలో ఉన్నప్పుడు పలుమార్లు ఆమె వదనాన్ని తలుచుకున్నాడు. దానిని శ్రద్ధగా విన్న హనుమ ఆ వర్ణనను మనసులో ‘భద్ర’పరుచుకున్నాడు. అమ్మవారి దర్శనమైతే అన్వేషణకు ‘భవ్యత’ చేకూరుతుంది.
తత్ అంటే ‘ఆ’… ఆ అంటే బ్రహ్మపదార్ధం, అదే అమ్మవారు. బ్రహ్మపదార్థాన్ని అన్వేషించాలి. ఆర్యా అంటే గుణములతో శ్రేష్ఠురాలైనది. ‘శుచిస్మితం- ఆహ్లాదకరమైన, సహజమైన, నిర్మలమైన చిరునవ్వు కలిగినది. అది ఉత్తమ స్త్రీమూర్తి లక్షణం. అందమైన నాసికతోను, స్వచ్ఛమైన దంతపంక్తులతో, తామరరేకుల వంటి కన్నులతో, విలసిల్లు పూర్ణచంద్రుడి వలె ప్రసన్నమై, దర్శనీయమై, ఒకసారి చూస్తే చాలు మళ్లీ మళ్లీ చూడాలనిపించే అత్యంత మనోహరమైన, ప్రసన్నమైన, చంద్రుడితో సమానమైనదైనా ఏ మచ్చలేని, ఆ సీతాదేవి వదనాన్ని దర్శించు భాగ్యము నాకెప్పుడు కలుగునో కదా…’ అనుకుంటాడు హనుమంతుడు.
పతంజలి మహర్షి ఒక సార్వకాలిక సత్యాన్ని చెప్పాడు. ‘వ్యక్తి ఉన్నతమైన లక్ష్యాన్ని ఏర్పర్చుకొని, అసాధారణమైన కర్తవ్య దీక్షతో ముందుకుసాగాలని తపించిన వేళ, ఆ నిష్ఠ అతణ్ని ఉత్తేజితుడిని చేస్తుంది. ఆ సమయంలో అతనిలోని చైతవ్యవంతమైన ఆలోచనలు పరిమితులన్నింటి అతిక్రమిస్తాయి. మానసిక పరిమితుల హద్దులను చెరిపివేసి అంతటా విస్తరించి కార్య ఆవిష్కరణకు మార్గం సుగమం చేస్తాయి. ఆ సమయంలో వ్యక్తిలోని ప్రజ్ఞ జాగృతమవుతుంది. అతను అద్భుతమైన అవకాశాలతో కూడిన ప్రపంచంలోకి అడుగుపెడతాడు. అంతర్గత శక్తి సామర్థ్యాలు జీవం పోసుకుంటాయి. ఆ శక్తి సామర్థ్యాలు ఆశించిన లక్ష్యాన్ని సాధించడమే కాదు, దానిని అధిగమించి ముందుకు నడిపిస్తాయి’ అని పతంజలి పేర్కొన్నాడు.
బాహ్య ప్రపంచంలో విజయం సాధించాలి అంటే ఆ విజయాన్ని అంతర్ ప్రపంచంలో దర్శించాలి, సాధించాలి. అంతర్ ప్రపంచంలో విజయాన్ని దర్శించడం అంటే ఆత్మ పరిశీలన చేసుకోవడమే! భావోద్వేగాలకు అతీతంగా, సహజ స్వీకృతికి అనుకూలంగా కర్తవ్యాన్ని ఉపాసనగా మార్చుకొని ముందుకు సాగడమే అంతర్ విజయం. దీనినే మరొక విధంగా చెప్పుకొంటే ఎవరి కన్నానో గొప్పగా ఉండాలనుకోవడం కన్నా, నిన్నటి మీద ఈ రోజు ఉన్నతంగా జీవించడంలోనే గొప్పదనం ఉంటుంది. నిజానికి కార్యసాధనలో మన గెలుపోటములు సాపేక్షాలే. జీవితాన్ని రసమయం చేసుకోవడంలో ఉన్న అవకాశాలను గమనించలేకపోవడం మాత్రమే తప్పుగా భావిస్తాం. ఆ తప్పిదాలను గుర్తించి వాటిని సరిచేసుకుంటే జీవితంలో అద్భుతాలు సాధించగలుగుతాం.
జీవితాన్ని రసమయం చేసుకునేందుకు అవసరమైన విధానాలలో శ్రద్ధ- కోరికలు ప్రథమ స్థానంలో నిలుస్తాయి. వాటినే ఇచ్ఛాశక్తి అన్నారు. దీనివల్ల మాత్రమే జీవితం రసమయం కాదు. దానికి జ్ఞానం, శిక్షణ కావాలి. దానినే జ్ఞానశక్తి అన్నారు. ఈ రెండూ సాధించినంత మాత్రాన కార్యావిష్కరణ జరిగి ఆనందం లభించదు. వాటిని నిరంతర సాధనతో, పట్టు వదలని దీక్షతో సంకల్పం జారిపోకుండా చూసుకోవాలి. గమనాన్ని గమ్యాన్ని పరిశీలించుకుంటూ అవసరమైన చేర్పులు, మార్పులు చేసుకుంటూ, ఆధునికీకరించుకుంటూ, నిన్నటి మీద ఈ రోజును ఉన్నతంగా మలుచుకుంటూ ముందుకు సాగాలి. దీనినే క్రియాశక్తి అన్నారు. అలా సాధించిన జ్ఞానాన్ని అవసరార్థులతో పంచుకోవడమే జీవితాన్ని రసమయం చేస్తుంది, శాశ్వతత్త్వాన్ని సాధించిపెడుతుంది.
హనుమ తాను లక్ష్యంగా పెట్టుకున్న సీతాన్వేషణ తన స్వార్థం కోసం కాదు. పరోపకారం కోసమే. మార్గంలో ఎదురైన అవరోధాలన్నింటినీ అధిగమించి, ముందుకు సాగాడు కాబట్టే అమ్మవారి దర్శనం పొందగలిగాడు. ఆయన ప్రేరణతో మనమూ నిన్నటి కంటే ఈ రోజును ఉన్నతంగా చేసుకుందాం.
– పాలకుర్తి రామమూర్తి
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- Improvise
- life
- Spirituality
- time
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

