నాకు పచ్చదనమంటే ప్రాణం. ప్రతినెలా కొత్త మొక్కలు కొని ఇంటికి తీసుకెళ్లడం అలవాటు. ప్రస్తుతం, దాదాపు 800 మొక్కలను పెరట్లో జాగ్రత్తగా కాపాడుకుంటున్నా. నా భర్త, పిల్లలు మాత్రం తమ పనుల్లో తాము బిజీగా ఉంటారు. మొక్కల పిచ్చిలోపడి నేను సమయాన్ని వృథా చేస్తున్నానని నా భర్త ఆరోపిస్తున్నాడు. పిల్లలు కూడా నేను గార్డెనింగ్ పేరుతో డబ్బు ఖర్చు చేస్తున్నానని తిడుతున్నారు. అంత కానిపని చేస్తున్నానా, నా సంతోషానికి సమయం కేటాయించుకోవడం తప్పా?
ఓ గృహిణి
జ: మీ భర్త, పిల్లలు ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉంటారని చెబుతున్నారు. అయినా మీరు ఒంటరి
తనాన్ని పక్కనపెట్టి ఇష్టమైన వ్యాపకాన్ని కొనసాగించడం మెచ్చుకోవాల్సిన విషయం. అన్ని మొక్కలను పెంచడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో ఇష్టంగా చేస్తే తప్ప ఇంత పని అసాధ్యం. డబ్బు విషయానికి వస్తే, మీ భర్త దాన్ని అనవసర ఖర్చుగా భావిస్తున్నారని అంటున్నారు. కాబట్టి, ఎలాంటి గొడవలు జరగకుండా ఉండాలంటే నెలనెలా కాకుండా.. మూడునెలలకు ఓసారి మొక్కలు, వాటికి కావాల్సిన సామగ్రి కొనుగోలు చేయొచ్చు.
అలా కాకుండా ఫేస్బుక్,
వాట్సాప్లో హరిత ప్రేమికుల బృందాలు ఉంటాయి. అందులో చేరి మొక్కలను ఉచితంగా ఇచ్చిపుచ్చుకోవచ్చు. అలాగే మీ కుటుంబ సభ్యులకు మీ ఇష్టాయిష్టాల గురించి చెప్పండి. మొక్కల పెంపకంలో మీరు పొందుతున్న ఆనందాన్ని వివరించండి. మీవాళ్లు మిమ్మల్ని కచ్చితంగా అర్థం చేసుకుంటారు.
సహానా రబీంద్రనాథ్ లైఫ్ కోచ్ అండ్ థెరపిస్ట్ SWITCH NOV హైదరాబాద్