తుంటి ఎముకలు… సాధారణంగా చాలా బలంగా ఉంటాయి. అంటే ఈ తుంటి ఎముకలు అంత సులువుగా దెబ్బతినవు. యుక్త వయసు వారిలో ఏదైనా పెద్ద ప్రమాదాల్లో గాయాలకు గురైనప్పుడు తప్ప తుంటి ఎముకలు విరగడం అన్నది జరగదు. నడుచుకుంటూ ప్రమాదవశాత్తు కింద పడటం, మెట్లు దిగుతూ జారిపడిన సందర్భాల్లో సాధ్యమైనంత వరకు తుంటి విరగదు. కానీ, వయసు పైబడిన వారిలో అంటే 60-70 ఏండ్లు దాటిన వారి పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది. అలా నడుస్తూ కిందపడినా తుంటి ఎముక విరిగే ప్రమాదం ఉంటుంది. దీనికి కారణం వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనం కావడమే!
పెద్ద వయసులో తుంటి ఎముక దెబ్బతింటే వాళ్లు కూర్చున్న చోటు నుంచి, పడుకున్న చోటు నుంచి పైకి లేవలేరు. నడవ లేరు కూడా! తుంటి ఎముక విరిగిన వారికి సరైన చికిత్స అందించకపోతే వాళ్లు మంచానికే పరిమితమవుతారు. దీనివల్ల శరీరంలో కదలికలు లేకపోవడంతో కొత్త రోగాలు పలకరిస్తాయి. అయితే ఇలాంటి రోగులకు గతంలో చికిత్స చేయాలంటే కూడా వయసు కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేవి. వాటిని అధిగమించి చికిత్స అందించేలోపు రోగులు ప్రాణాపాయస్థితిలోకి వెళ్లే పరిస్థితి ఉండేది. కానీ, ఇప్పుడు అలాంటి సమస్యలను అధిగమించేందుకు అత్యాధునిక చికిత్సా పద్ధతులు అందుబాటులోకి వచ్చాయని చెబుతున్నారు ఆర్థో వైద్య నిపుణులు. సర్జరీ జరిగిన మరుసటి రోజే రోగి లేచి స్వతహాగా నడవవచ్చంటున్నారు. తుంటి ఎముక శస్త్ర చికిత్సలో వచ్చిన అత్యాధునిక వైద్య పద్ధతులు ఏమిటి? వాటి వల్ల రోగికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తదితర అంశాలను నేటి ఊపిరిలో తెలుసుకుందాం.
యుక్తవయసు వారిలో కంటే 60-70 ఏండ్లు దాటిన వృద్ధుల్లో ఎముకలు చాలా బలహీనంగా ఉంటాయి. దీనికి ప్రధాన కారణం వయసు పెరిగే కొద్దీ ఎముకల్లో క్యాల్షియం తగ్గిపోతూ ఉంటుంది. ఇలా ఎముకల్లో క్యాల్షియం తగ్గిపోవడాన్నే వైద్య పరిభాషలో ‘ఆస్టియోపొరోసిస్’ అంటారు. దీనివల్ల వృద్ధులు నడుస్తూ కిందపడిపోయినా లేక తేలికపాటి గాయాలైనా కూడా వారిలో ఎముకలు విరిగిపోయే ప్రమాదం ఎక్కువ. ముఖ్యంగా వృద్ధులు నడుస్తూ కాలు జారి కింద పడటం, లేదా తట్టు తగిలి పడటం, బాత్రూమ్లో జారి పడటం లాంటివి జరిగినప్పుడు వారిలో తుంటి ఎముక విరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
సాధారణంగా తుంటి విరిగిన రోగులు మంచానికే పరిమితమవుతారు. సకాలంలో శస్త్రచికిత్స చేయకపోతే వారు లేచి నడవలేరు, కూర్చోలేరు. దీంతో శరీరంలో కదలికలు లేక, మంచానికే పరిమితమవుతారు. దీనివల్ల బెడ్‌సోర్స్ వచ్చి, రోగి మరింత బలహీనమవుతాడు. శరీరంలో కదలికలు లేకపోవడంతో జీవక్రియలు నిలిచిపోయి గుండె, కాలేయం, ఊపిరితిత్తులు లాంటి ప్రధాన అవయవాల పనితీరు మందగించి రోగి ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది.
తుంటి ఎముక విరిగినప్పుడు గతంలో జరిపే శస్త్రచికిత్సల్లో ఇంప్లాంట్స్‌ను వేసి ఎముకలను అతికించేవారు. అయితే వయసు కారణంగా రోగి ఎముకలు బలహీనంగా ఉండటం వల్ల తుంటి ఎముక డొల్లగా మారి, ఇంప్లాంట్‌కు వేసిన స్క్రూలు ఊడిపోవడం, ఎముక మళ్లీ విరిగిపోవడం జరిగి శస్త్రచికిత్సలు విఫలమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. అంతే కాకుండా రోగికి శస్త్రచికిత్స చేయాలంటే అందుకు సంబంధించిన కొన్ని ప్రాథమిక వైద్యపరీక్షలు చేయాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా గుండె పరీక్ష, బీపీ, షుగర్, కాలేయం, కిడ్నీ తదితర అవయవాల పనితీరుకు సంబంధించిన పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అయితే వృద్ధుల్లో చాలామందికి కొన్ని అనారోగ్య సమస్యలు ఉండటం వల్ల… ముందుగా వాటికి చికిత్స చేయాల్సి వచ్చేది. అన్నీ కుదురుకున్న తరువాతే తుంటికి శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చేది. దీంతో పుణ్యకాలం కాస్తా గడిచి.. రోగి ఆరోగ్యం మరింత దెబ్బతినేది. కొన్ని సందర్భాల్లో శస్త్ర చికిత్స చేసేలోపే రోగి మృత్యువాతపడేవాడు. వీటన్నింటినీ అధిగమించడానికి హిప్ ఫ్రాక్చర్ సర్జరీల్లో అత్యాధునిక పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి.
తుంటి ఎముక విరిగిన రోగులకు అత్యాధునిక చికిత్సా పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. అందులో ముఖ్యంగా 5 విధానాలు ఉన్నాయి. 1. టైమ్ టు థియేటర్ 2. కాంప్రహెన్సివ్ ఆర్థో జరియాట్రిక్ కేర్ 3. అనస్తీషియా అండ్ పెయిన్ మేనేజ్మెంట్ 4. అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ 5. అడ్వాన్స్డ్ రిహాబిలిటేషన్
తుంటి ఎముక విరిగిన రోగికి నిర్ణీత సమయంలో చికిత్స అందించాలి. అంటే 48 గంటల్లో శస్త్రచికిత్స చేయాలి. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ఆధునిక పద్ధతిలో రోగికి వేరే ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ, వాటికి చికిత్స అందిస్తూనే మరో పక్క తుంటికి శస్త్రచికిత్స చేస్తారు. ఇలా చేయడం వల్ల రోగికి వైకల్యంతోపాటు ప్రాణాపాయం తగ్గినట్లు పలు అధ్యయనాల్లో వెల్లడైంది.
కాంప్రహెన్సివ్ ఆర్థో జరియాట్రిక్ కేర్ : వయసు పైబడిన వారిలో ఏదో ఒక అనారోగ్య సమస్య ఉండటం సర్వసాధారణం. అందుకని ఆధునిక పద్ధతిలో జరియాట్రిషన్ పర్యవేక్షణలో శస్త్రచికిత్సకు ముందు, సర్జరీ సమయంలో, ఆ తరువాత కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వయసురీత్యా ఉన్న అనారోగ్య సమస్యలకు చికిత్స అందించడం జరుగుతుంది.
అనస్తీషియా, పెయిన్ మేనేజ్మెంట్ : తుంటి విరిగిన రోగులకు తీవ్రమైన నొప్పి ఉంటుంది. రోగులు అటూ, ఇటూ కదల్లేని పరిస్థితి. దీనివల్ల అప్పటికే ఉన్న గుండె సమస్యలు లేదా కిడ్నీ, కాలేయ సమస్యలు వంటివి మరింత తీవ్రమవుతాయి. అందుకని పెయిన్ రిలీవింగ్ పద్ధతులైన ఫేసియా, ఇలియకా బ్లాక్, రీజినల్ బ్లాక్ చికిత్స అందించడం జరుగుతుంది. దీనివల్ల రోగిలో నొప్పిని తగ్గించడంతో పాటు నొప్పి నివారణ కోసం అందించే మందుల డోస్‌ను తగ్గించడం జరుగుతుంది. ఇలా ఔషధాల డోస్ తగ్గించడంతో దుష్ప్రభావాలు కూడా తగ్గుతాయి.
తుంటి ఫ్రాక్చరైన రోగి మంచానికే పరిమితమవడం ఒకప్పటి మాట. ఇప్పుడు ఆ అవసరం లేదు. సర్జరీ జరిగిన రెండో రోజు నుంచే రోగి అటూ ఇటూ కదలడం, లేచి నిలబడటం, నడవటం లాంటివి చేయవచ్చు. ఫిజియోథెరపిస్టుల సహకారంతో రోగిని కచ్చితంగా నడిపించడమే ఈ అడ్వాన్స్డ్ రిహాబిలిటేషన్.
తుంటి ఆపరేషన్ తరువాత రోగి బాగానే నడుస్తున్నాడు కదా అని నిర్లక్ష్యం చేస్తే రెండో వైపు తుంటి విరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వయసు వల్ల వచ్చే ఆస్టియోపొరాసిస్ వల్ల ఎముకలు బలహీనపడతాయి. అందుకని సర్జరీ తరువాత ఆస్టియోపొరాసిస్ చికిత్స తప్పనిసరి. దీని వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి.
అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్‌లో రెండు పద్ధతులు ఉన్నాయి. 1.ట్రామా సిమ్ 2. డ్యూయల్ మొబిలిటీ హిప్ రీప్లేస్మెంట్
1. ట్రామాసిమ్ పద్ధతి : సాధారణ పద్ధతిలో అయితే సర్జరీ చేసేటప్పుడు బలహీనమైన ఎముకను ఇంప్లాంట్ (రాడ్)తో బిగిస్తారు. అయితే సర్జరీ తరువాత రోగి నడిచేటప్పుడు ఈ ఇంప్లాంట్ కదలికకు గురై చికిత్స విఫలమయ్యే అవకాశాలు ఎక్కువ. అందుకని ట్రామాసిమ్ పద్ధతిలో ఎముకను ఇంప్లాంట్ కదలకుండా గట్టిగా పట్టుకునే విధంగా బోన్ సిమెంట్‌ను ఇంజక్ట్ చేస్తారు. దీని వల్ల ఎముక, ఇంప్లాంట్, సిమెంట్ కలిసి ఒక బలమైన నిర్మాణంగా మారుతుంది. ఫలితంగా శస్త్రచికిత్స జరిగిన రెండో రోజు నుంచే లేచి నడిచే విధంగా రోగి బరువును శస్త్రచికిత్స చేసిన ఎముక మోయగలుగుతుంది.
2. డ్యూయల్ మొబిలిటీ హిప్ రీప్లేస్మెంట్ : వృద్ధులు కిందపడి గాయాలైనప్పుడు కొన్ని సందర్భాలలో తుంటి ఎముక పూర్తిగా దెబ్బతింటుంది. అలాంటప్పుడు తుంటి మార్పిడి చేయాల్సి వస్తుంది. అయితే సాధారణంగా తుంటి మార్పిడి చేసినప్పుడు కృత్రిమ కీళ్లు తొలగిపోయే అవకాశం ఉంటుంది. అదే డ్యుయల్ మొబిలిటీ పద్ధతిలో అయితే ఇలా కృత్రిమ కీళ్లు తొలగిపోయే అవకాశాలు చాలా తక్కువ.