ఎండల్లో ఎక్కువగా తిరిగితే.. చర్మం తేమను కోల్పోతుంది. ముఖమంతా వాడిపోయి.. అంద విహీనంగా మారుతుంది. మళ్లీ ముఖవర్చస్సును పెంచడంలో ‘ఐస్ థెరపీ’ సమర్థంగా పనిచేస్తుంది. రూపాయి ఖర్చులేకుండా ఇంట్లోని ఫ్రిజ్‌లో తయారయ్యే ఐస్ క్యూబ్.. మిమ్మల్ని నైస్‌గా మార్చేస్తుంది.
ఐస్ క్యూబ్‌ను మెత్తటి వస్త్రంలో చుట్టి, ముఖంపై సున్నితంగా మర్దనా చేసుకోవడమే.. ఐస్ థెరపీ. చర్మం రకాన్ని బట్టి రెండుమూడు నిమిషాలపాటు మర్దనా చేసుకోవాలి. ముఖ్యంగా, అందం కోసం టీ-జోన్ (నుదురు, ముక్కు, గడ్డం) ప్రాంతంలో సున్నితంగా మసాజ్ చేస్తే చాలు. ఈ చిన్న టెక్నిక్.. ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.
ఐస్ థెరపీ.. చర్మానికి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దాంతో చర్మం కాంతిమంతంగా, ఆరోగ్యంగా తయారవుతుంది.
నిద్రలేమి, ఎండలో తిరగడం వల్ల కళ్ల కింద వాపు కనిపిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో 5 నుంచి 10 నిమిషాల పాటు కళ్ల కింద సున్నితంగా ఐస్ థెరపీ చేయాలి. రక్త ప్రసరణ మెరుగుపడి.. కంటి కింద వాపు, నల్లటి వలయాలు తగ్గుతాయి. కళ్లు అందంగా కనిపిస్తాయి.
ఐస్ థెరపీతో చర్మంలోని రక్తనాళాలు సంకోచించి.. చర్మం బిగుతుగా మారుతుంది. చర్మ రంధ్రాలు కూడా చిన్నగా కనిపిస్తాయి. దాంతో ముఖంలో కాంతి పెరుగుతుంది.
చెమటతో మొటిమలు వస్తాయి. ఇలాంటి సందర్భాల్లో మొటిమలపై 10 నుంచి 15 నిమిషాలు ఐస్ థెరపీ చేయాలి. దీనివల్ల రక్తనాళాలు సంకోచిస్తాయి. వాపు, ఎరుపును తగ్గిస్తాయి. మొటిమలు పూర్తిగా తొలగకపోయినా.. దాని పరిమాణం తగ్గిపోతుంది.
ఐస్ థెరపీతో చర్మంలో కొలాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఫలితంగా చర్మం మరింత బిగుతుగా తయారై.. యవ్వనంగా కనిపిస్తారు.
చర్మం మరింత సున్నితంగా ఉంటే.. ఎండలకు ఎర్రగా కందిపోతుంది. కొందరిలో మంట కూడా కలిగిస్తుంది. ఐస్ థెరపీతో ఈ సమస్యకు ఇట్టే చెక్ పడుతుంది. కందిపోయి మంట కలిగించే చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది.
అనేక ప్రయోజనాలు అందించే ఐస్ థెరపీని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. అయితే, సరైన జాగ్రత్తలు పాటించడం మాత్రం తప్పనిసరి. కొన్ని సందర్భాల్లో ఐస్ క్యూబ్స్ చర్మానికి హాని కలిగించవచ్చు. ముఖ్యంగా, కళ్ల కోసం ఉపయోగించే సమయంలో
మరింత అప్రమత్తంగా ఉండాలి.