టీనేజ్‌లోకి అడుగుపెడుతున్న సమయంలో ఎంతోమందిని వేధించే సమస్య ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ (IBD). ఇది కేవలం జీర్ణవ్యవస్థకు సంబంధించిన తాతాలిక అనారోగ్యం మాత్రమే కాదు. జీవిత గమనాన్ని, భవిష్యత్తును ప్రభావితం చేసే దీర్ఘకాలిక సమస్య. శరీర రోగనిరోధక వ్యవస్థ అసహజంగా స్పందించి జీర్ణవ్యవస్థలో నిరంతర మంట, వాపు కలిగించినప్పుడు ఐబీడీ వస్తుంది. చిన్నపిల్లలు, టీనేజర్లలో ఐబీడీని సకాలంలో గుర్తించకపోతే వారి శారీరక వికాసం దెబ్బతింటుంది. జీర్ణవ్యవస్థలో నిరంతరం వాపు ఉండటం వల్ల తిన్న ఆహారంలోని పోషకాలు శరీరానికి అందవు. ఫలితంగా బరువు పెరగడం కష్టమవుతుంది. ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తించి సరైన చికిత్స అందిస్తే శారీరక పెరుగుదల, ఆరోగ్య సమతుల్యత దెబ్బతినకుండా కాపాడవచ్చు.
వయసుకు తగ్గ శరీర నిర్మాణం, సత్తువ లేకపోవడం, తరచూ విసర్జనకు వెళ్లాల్సి రావడంతో బాధితులు నలుగురిలోకి వెళ్లడానికి వెనుకాడతారు. ఇతరులు ఏమనుకుంటారోననే భయపడుతుంటారు. ఫలితంగా మానసిక ఆందోళన, డిప్రెషన్‌కు గురయ్యే అవకాశముంది. ఈ సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి లభించే మద్దతు చాలా అవసరం. బయటికి వెళ్లేముందు వాష్‌రూమ్‌లు ఎకడ ఉన్నాయో తెలుసుకోవాలి. పాఠశాలలు లేదా పనిచేసే చోట ముందే తమ ఆరోగ్య పరిస్థితిని వివరించి వెసులుబాట్లు కోరడం అవసరం. నమ్మకమైన స్నేహితులు, ఉపాధ్యాయులు, సహోద్యోగులతో పరిస్థితిని పంచుకోవడం వల్ల అపోహలు తొలిగిపోతాయి. సరైన వైద్యం, జీవనశైలి మార్పులతో సాధారణ, ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చు.