న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: రుణ గ్రహీతలకు శుభవార్తను అందించింది దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్. రుణాలపై వడ్డీరేటును 10 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. పలు కాలపరిమితి రుణాలపై మాత్రమే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 10 బేసిస్ పాయింట్లు కోత విధించింది. దీంతో ఆయా కాలపరిమితిల్లో తీసుకున్న రుణ గ్రహీతలకు నెలవారీ చెల్లింపులు మరింత తగ్గనున్నాయి.
ఈ తగ్గింపు వెంటనే అమల్లోకి రానున్నట్టు బ్యాంక్ ఒక ప్రకటనలో వెల్లడించింది. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఒక్క రోజు, నెల కాలపరిమితి కలిగిన రుణాలపై ఎంసీఎల్ఆర్ 8 శాతం నుంచి 7.90 శాతానికి తగ్గగా, మూడు నెలల రుణాలపై రేటును కూడా 8.15 శాతం నుంచి 8.05 శాతానికి దించింది. దీంతోపాటు ఆరు నెలల రుణాలపై ఎంసీఎల్ఆర్ను 8.25 శాతానికి, ఏడాది రుణాలపై రేటును 8.40 శాతం నుంచి 8.35 శాతానికి తగ్గించింది. వీటితోపాటు రెండేండ్ల కాలపరిమితి రుణాలపై ఎంసీఎల్ఆర్ని 8.55 శాతం నుంచి 8.45 శాతానికి దించిన బ్యాంక్..మూడేండ్ల రుణాలపై రేటును 8.65 శాతంనుంచి 8.60 శాతానికి తగ్గించింది. అలాగే బ్యాంక్ బేస్ రేటును 8.70 శాతంగా నిర్ణయించింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంక్ 2.75 శాతం నుంచి 6.50 శాతం వరకు వసూలు చేస్తున్నది.