చెన్నై : దులీప్ ట్రోఫీ ఫైనల్లో రెండో రోజుకే ఈస్ట్ జోన్ మ్యాచ్‌ను శాసించే స్థితికి చేరింది. తొలి రోజే సెంచరీ బాదిన కెప్టెన్ ఇషాన్ కిషన్ (334 బంతుల్లో 30 ఫోర్లు, 7 సిక్స్‌లతో 270) ద్విశతకానికి తోడు కుమార కుశాగ్ర (132 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 101) సెంచరీతో చెలరేగగా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 708 పరుగుల కొండంత స్కోరు సాధించింది. ఓవర్ నైట్ స్కోరు 385/4తో రెండో రోజు, సోమవారం ఆట కొనసాగించిన ఇషాన్, కుశాగ్ర పసలేని సౌత్ బౌలింగ్ దాడిని సమర్థవంతంగా ఎదుర్కున్నారు. కుశాగ్రతో కలిసి ఐదో వికెట్‌కు రికార్డు స్థాయిలో 230 పరుగులు జతచేసిన ఇషాన్.. తన జట్టుకు తిరుగులేని స్థితిలో నిలిపాడు.
ఆ తర్వాత అనుకూల్ రాయ్ (45)తో జతకలిసిన ఇషాన్.. లంచ్ తర్వాత కొద్దిసేపటికి 270 బంతుల్లో ద్విశతకాన్ని పూర్తిచేశాడు. అనంతరం సిక్స్‌లతో రెచ్చిపోయిన అతడు.. 250 పరుగుల మైలురాయిని అధిగమించాడు. అనుకూల్‌తో ఆరో వికెట్‌కు 140 రన్స్ జోడించిన తర్వాత రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. ఇషాన్ వెళ్లినా లోయరార్డర్లో ఖురేషి (40), షమీ (28) కూడా రాణించారు. ఆఖర్లో మళ్లీ క్రీజులోకి వచ్చిన ఇషాన్.. స్కోరును 700 దాటించాక నిష్క్రమించడంతో ఈస్ట్ జోన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. తిలక్ కెప్టెన్సీలోని సౌత్ జోన్ బౌలర్లలో విజయ్‌కు 4 వికెట్లు దక్కగా సీవీ మిలింద్, గోపాల్ చెరో రెండు వికెట్లు తీశారు. స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ రెండో రోజూ తేలిపోయాడు.