న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ మోటర్..మహిళా ఉద్యోగులకు పెద్దపీట వేస్తున్నది. మొత్తం ఎగ్జిక్యూటివ్ వర్క్‌ఫోర్స్‌లో 2030 నాటికి 20 శాతం వీరిని నియమించుకోబోతున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం వీరి వాటా 8 శాతంగా ఉండగా, వచ్చే ఐదేండ్లలో రెండింతలు కంటే అధికంగా పెంచకోనున్నట్టు కంపెనీ ఎండీ, సీఈవో తరుణ్ గార్గ్ తెలిపారు.
ప్రస్తుతం సంస్థలో 4 వేల మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు. అలాగే ఈ ఏడాది నియమించుకున్న మొత్తం ఉద్యోగుల్లో 45 శాతం మంది ఉద్యోగులు యంగ్ టాలెంట్ కావడం విశేషం. దేశీయ ఆటోమొబైల్ రంగం రూపాంతరం చెందుతున్నదని, అధునాత తయారీ, డిజిటలైజేషన్, మారుతున్న వినియోగదారుల అంచనాలకు తగ్గట్టుగా సంస్థలు మారాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.