ఏ ఇతర క్యాన్సర్ల నివారణకు లేని వెసులుబాటు.. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు ఉండటం అదృష్టంగా భావించాలి. ఎందుకంటే వ్యాధి రాకుండా ముందుగానే టీకా తీసుకుంటే జీవితంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ మన దరిచేరదు. దేశంలో రోజురోజుకూ ఈ క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతున్నది. ఏటా 1,34,240 సర్వైకల్ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. 2025 వరకు ఈ సంఖ్య 2,03,757కు చేరవచ్చని వైద్యశాస్త్రవేత్తల అంచనా. సర్వైకల్ క్యాన్సర్‌తో ఏటా 72,825మంది మరణిస్తున్నట్లు మెడికల్ రికార్డులు చెబుతున్నాయి. అయితే నివారణ కోసం టీకాలు అందుబాటులో ఉన్నప్పటికీ.. చాలామంది అవగాహనా లోపం వల్ల ఈ వ్యాధిన పడుతుండటం ఆందోళనకరమైన విషయం.
‘సర్వైకల్ క్యాన్సర్’ అంటే?
గర్భాశయ ముఖద్వారం వద్ద వచ్చే క్యాన్సర్‌ను సర్వైకల్ క్యాన్సర్ లేదా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటారు. గర్భాశయ ముఖద్వారం అనేది గర్భాశయానికి కింది భాగంలో ఉండే సన్నని ప్రదేశం. ఇది గర్భాశయానికి ముఖద్వారంగా పనిచేయడంతోపాటు గర్భాశయాన్ని యోనితో కలిపి ఉంచుతుంది. ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను ఇతర క్యాన్సర్ల కంటే సులభంగా నివారించవచ్చు.
వీరికి స్క్రీనింగ్ పరీక్షలు తప్పనిసరి
21 ఏండ్ల వయసు నిండిన లేదా దాంపత్య జీవితాన్ని ప్రారంభించి మూడేళ్లు గడిచిన వారు తప్పకుండా పీఏపీ పరీక్ష చేయించుకోవాలి. సాధారణంగా 50 ఏండ్లు నిండిన మహిళల్లో ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. అంటే ప్రతి మహిళా.. పీఏపీ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.
వ్యాధికి గల కారణాలు
హ్యూమన్ పాపిలోమా(హెచ్‌పీవీ) అనే వైరస్ వల్ల ఈ క్యాన్సర్ వస్తుంది. ఈ వైరస్ శృంగారం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తిచెందుతుంది. అయితే ఈ వైరస్ సోకిన ప్రతి ఒక్కరికీ క్యాన్సర్ రాదు. వారిలో కొందిరికి మాత్రమే సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే శృంగారంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ హెచ్‌పీవీ వైరస్ సోకే అవకాశాలు ఉంటాయి. అయితే చిన్నవయసులో శృంగారంలో పాల్గొనడం, ఎక్కువ మందితో శృంగారంలో పాల్గొనడం లేదా పాల్గొనే వారితో కలవడం వల్ల హెచ్‌పీవీ వైరస్ సోకే అవకాశాలు ఎక్కువ. హెచ్‌పీవీ అనేది మూడు రకాలు.
వీరిలో రిస్క్ ఎక్కువ
హెచ్‌పీవీ వైరస్ సాధారణంగా దానంతట అదే తగ్గిపోతుంది. అలా తగ్గకపోతే కొంతకాలం తరువాత క్యాన్సర్‌కు దారితీసే అవకాశాలు ఉంటాయి. అయితే ధూమపానం, ఎయిడ్స్, ఐదు సంవత్సరాలు లేదా అంతకన్న ఎక్కువ కాలం గర్భనిరోధక మాత్రలు వాడటం, ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువమంది పిల్లలను కనడం వంటివి సర్వైకల్ క్యాన్సర్‌కు దారితీస్తాయి.
నివారణ మార్గాలు
1. 21 ఏండ్లు నిండిన లేదా శృంగారంలో పాల్గొనడం ప్రారంభించి మూడేండ్లు గడిచిన ప్రతి మహిళా.. పీఏపీ స్క్రీనింగ్ పరీక్ష చేయించుకోవాలి.
2. 9-18 ఏండ్ల మధ్య వయసు గల బాలికలు, యువతులు తప్పకుండా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి.
3. 6నెలల వ్యవధిలో 3సార్లు హెచ్‌పీవీ టీకా తీసుకోవాలి.
4. జీవిత భాగస్వామితో మాత్రమే దాంపత్య జీవితాన్ని గడపాలి.
5. ధూమపానం, మధ్యపానానికి దూరంగా ఉండటం మంచిది.
– డాక్టర్ మోహనవంశీ
చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్,
ఒమేగా హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్
98490 22121