మీ భాగస్వామి ఒకేమాటను పదేపదే చెబుతూ.. మిమ్మల్ని గందరగోళానికి గురిచేస్తున్నారా? తన వాదనలను సుదీర్ఘకాలంపాటు వినిపిస్తూ.. అదే నిజమని మిమ్మల్ని ఒప్పిస్తున్నారా? మీకు వాస్తవం తెలిసినా.. దానిపై సందేహాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారా? మీపై మీకే నమ్మకం కోల్పోయేలా మాట్లాడుతున్నారా? మిమ్మల్ని మానసికంగా ఆత్మన్యూనతలోకి నెట్టడానికి ప్రయత్నిస్తున్నారా? అయితే.. మీ భాగస్వామి మీపై ‘గ్యాస్ లైటింగ్’ ప్రయోగం చేస్తున్నట్టే.. అంటున్నారు మానసిక నిపుణులు. మరి.. మీ భాగస్వామి మిమ్మల్ని గ్యాస్ లైటింగ్ చేస్తున్నారో లేదో ఒక్కసారి క్రాస్‌చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. అందుకు సంబంధించిన కొన్ని సంకేతాలను వివరిస్తున్నారు.
వీళ్లు ఎదుటివారి భావోద్వేగాలను పట్టించుకోరు. మీ కుటుంబసభ్యులు, స్నేహితులను విశ్వాసం లేనివారిగా చిత్రీకరిస్తారు. వారితో మాట్లాడకుండా మిమ్మల్ని నిలువరిస్తారు. క్రమంగా మిమ్మల్ని ఒంటరిని చేస్తారు. చివరికి మీరు మీ భాగస్వామి దారిలోకి వెళ్తారు. ఇలా.. మీపై మీకే నమ్మకం కోల్పోయేలా, మీపై మీకే అనుమానం కలిగేలా చేస్తారు. ‘గ్యాస్ లైటింగ్’ అనేది ఒక్కసారిగా జరిగే ప్రక్రియ కాదు. చాలా సూక్ష్మంగా.. నెమ్మదిగా సాగుతుంది. అవతలి వ్యక్తికి అర్థమయ్యే సమయానికి.. తమపై తామే నమ్మకం కోల్పోయే పరిస్థితి వచ్చేస్తుంది. అందుకే.. ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలి. భాగస్వామి మాటల్ని లోతుగా అర్థం చేసుకోవాలి. వెంటనే తేరుకోవాలి. లేకుంటే.. జీవితాంతం అందులోనే ఉండిపోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.