దీపారాధనలో ఎన్ని వత్తులు ఉంచాలి?
ప్రత్యేకంగా ఈ దైవానికి ఇన్ని వత్తులు
వేయాలనే నియమం ఏమైనా ఉన్నదా?
శ్లో॥ సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహమ్
భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే
త్రాహిమాం నరకాత్ ఘోరాద్దివ్య జ్యోతిర్నమోస్తుతే॥
అని పఠిస్తూ నిత్యపూజలో దీపాన్ని వెలిగిస్తారు. ముందుగా దీపారాధన చేయడమనేది షోడశోపచార పూజలోనూ, నిత్య దేవతా పూజలోనూ ప్రధానమైన ప్రక్రియ. దేవుడికి సమర్పించే దీపంలో మూడు వత్తులు ఉండాలని పైశ్లోకం వివరిస్తుంది. ఈ మూడు వత్తులు ముల్లోకాలకూ, సత్వ, రజో, తమో గుణాలకూ, త్రికాలాలకూ సంకేతంగా చెబుతారు. దీపం అంటే వెలుగు, కాంతి, జ్ఞానం అని భావం.
‘ఓ దైవమా! మూడు లోకాల చీకట్లను పోగొట్టగలిగిన దీపాన్ని వెలిగించాను.
ఓ పరమాత్మా! నీకు ఎంతో ఇష్టమైన నేతితో కూడిన మూడు వత్తులతో కూడిన దీపమిది. దీన్ని అగ్నితో వెలిగించి భక్తితో నీకు నివేదిస్తున్నాను. ఈ దీపాన్ని స్వీకరించి నన్ను అనుగ్రహించు. భయంకరమైన నరకం నుంచి రక్షించగలిగిన దైవ స్వరూపమూ, మహిమాన్వితమూ అయిన ఈ జ్యోతికి నమస్కరిస్తున్నాను’ అని ఈ ప్రార్థన భావం. పండుగ రోజులలో మాత్రం కుటుంబ సంక్షేమం కోసం స్త్రీలు వెలిగించే దీపానికి ఐదు వత్తులుండాలని ఒక విశ్వాసం ఉంది. కానీ, దేవతల రూపాలను అనుసరించి వత్తుల సంఖ్యలో మార్పులుండాలనే నియమమేదీ లేదు. దీపంలో మూడు వత్తులు వేయాలనేదే శాస్త్ర ప్రమాణం.
– శ్రీ