తల భాగంలోని శ్వాస, జీర్ణ సంబంధ వ్యవస్థలో వచ్చే క్యాన్సర్లను హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లు అంటారు. పెదాలు, నోరు, చిగుర్లు, నాలుక, నాసల్క్యావిటీ, ఫారింక్స్, స్వరపేటిక వంటి భాగాలలో ఈ క్యాన్సర్లు వస్తాయి. ఇవి 90% వరకూ స్కామస్ (Squamous) సెల్ కార్సినోమా రకానికి చెందినవి. అంటే మ్యూకస్ ఉండి ఎప్పుడూ తడిగా ఉండే లోపలి పెదాలు, చిగుర్లు, నాలుక వంటి భాగాల్లో ఈ క్యాన్సర్లను గమనిస్తాం.
ఊపిరితిత్తుల క్యాన్సర్ల మాదిరిగానే వీటికి కూడా ఆల్కహాల్, పొగాకు, పొగాకు సంబంధిత ఉత్పత్తులే ప్రధాన కారణాలు. హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) కూడా ఒక కారణం. ఆల్కహాల్, పొగాకు అలవాట్లు రెండూ ఉన్నట్లయితే ఈ ముప్పు ఎక్కువ. HPV వైరస్ 16 నుంచి 18 రకాలను నాలుక మొదటి భాగంలో, టాన్సిల్స్ ఇంకా కొన్ని రకాల తల, మెడకు సంబంధించిన క్యాన్సర్లకు కారణాలు.
నోటిలో తెలుపు, ఎరుపు మిళితమైన మచ్చలు, గొంతునొప్పి కారణంగా బొంగురు పోయి ఉండటం, మింగడానికి కష్టంగా ఉండటం, దవడల వాపు, శ్వాస తీసుకోవడానికి, మాట్లాడటానికి కష్టంగా ఉండటం, తలనొప్పి, వినికిడిశక్తి తగ్గటం, చెవిపోటు.. ఇలా క్యాన్సర్ కణితి పెరిగే ప్రదేశాన్ని బట్టి లక్షణాలు అనేక రకాలుగా ఉంటాయి. దంతాలు కొనదేలి పదేపదే పెదాలలో లేక నోటి లోపలి భాగంలో పుండు పడేటట్లు చేసినా, ప్రాంతాలను బట్టి ఉండే అలవాట్లు, HIV వైరస్, పొగాకు ఉత్పత్తులు, ఆల్కహాల్, ఎప్స్టియన్ బార్ (Epssstein Baar) వైరస్, నిల్వ ఉండే ఆహార పదార్థాలు, చెక్కపొడి, ఆస్బెస్టాస్, మెటల్, టెక్స్టైల్ రంగాలలో పనిచేసే వారికి, ఇతర ఆరోగ్య సమస్యలకు తలభాగంలో ఇచ్చే రేడియేషన్ ఈ క్యాన్సర్కు దారితీసే ప్రమాదం ఉంది.
లక్షణాలు అనుమానాస్పదంగా ఉంటే బయాప్సి, MRI, CT, PET వంటి ఇమేజింగ్ ప్రొసీజర్లతో క్యాన్సర్ వచ్చిన భాగాన్ని, స్టేజ్, గ్రేడింగ్లను నిర్ధారిస్తారు. చికిత్స విధానాలు.. క్యాన్సర్ వచ్చిన భాగం, స్టేజ్, రోగి వయస్సు, వారి ఆరోగ్యం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. సర్జరీ, రేడియేషన్, కీమో, టార్గెటెడ్ థెరపీ లేదా కొన్ని రకాల కాంబినేషన్ థెరపీలను అవసరాన్ని బట్టి నిర్ణయిస్తారు. తల, మెడ వంటి సున్నితమైన భాగాలలో చికిత్సలు చేసినప్పుడు, ఆ చికిత్స పూర్తయిన తర్వాత వాటి పనితీరులో, మొహంలో అనేక మార్పులు వస్తాయి. ఆహారం తీసుకునేటప్పుడు, మాట్లాడేటప్పుడు, గొంతులో మార్పు, నమలడానికి ఇబ్బంది పడటం, దవడ ఎముక పట్టేసినట్లు ఉండటం, మొద్దుబారినట్లు ఉండటం వంటి మార్పులు చోటుచేసుకుంటాయి. కాబట్టి, సర్జరీలను చాలా జాగ్రత్తతో చేసే అనుభవజ్ఞులైన వైద్యుల దగ్గరే చేయించుకోవడం చాలా ముఖ్యం.
హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లు ప్రధానంగా ఓరల్ క్యావిటి, ఫారింజియల్, లారింజియల్, పారానాసల్ సైనసెస్ మరియు నాసల్ క్యావిటి, లాలాజల (Salivary) గ్రంథులు.. భాగాలలో ఎక్కువగా వస్తాయి.
మనదేశంలో కనిపించే ప్రతి మూడు క్యాన్సర్లలో ఒకటి ఈ క్యాన్సర్కు సంబంధించినదై ఉంటుంది. ఆలస్యంగా గుర్తించడం వలన లేక ఇతర భాగాలకు (మెటాస్టాసిస్) ఈ క్యాన్సర్ వ్యాపించడం వలన ఈ క్యాన్సర్లకు గురైన వారిలో మరణాల సంఖ్యా ఎక్కువే. పొగాకును అనేక రకాలుగా ఉపయోగించడం, సున్నం కలిపి ఎక్కువసేవు నోటిలో ఉంచుకోవడం, తమలపాకు, వక్క నమలడం వంటి అలవాట్లు ఈ సంఖ్య పెరగడానికి దోహదం చేస్తున్నాయి.
తొలిదశలో కనుగొంటే Stage 1, 2లకు కేవలం సర్జరీతోనే ఈ క్యాన్సర్లకు శాశ్వత పరిష్కారం లభించవచ్చు. సర్జరీ తర్వాత చాలాసార్లు రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అవసరం ఉంటుంది. స్టేజ్ 3, 4 లకు కీమో, రేడియేషన్ ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. 3D CRT, VMAT, IGRT, IGKT, బ్రాకీథెరపీ, బీమ్ థెరపీ వంటి ఆధునిక పద్ధతులలో చికిత్స విధానాలు ఉంటాయి. ఈ చికిత్సల తర్వాత రోగులు ఇంతకుముందున్న దురలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండటం, నోటి పరిశుభ్రతను జాగ్రత్తగా కాపాడుకోవటం, ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, జా స్ట్రెచింగ్ ఎక్సర్సైజులు వంటివి చేయడంతోపాటు తప్పకుండా అవసరమైన పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. నోటిలో నొప్పిలేకుండా తెలుపు (ల్యుకోప్లేకియా) లేదా ఎరుపు (ఎరిత్రో ప్లేకియా) రంగులో ప్యాచెస్ కనిపించినప్పుడు తప్పకుండా పరీక్షలు చేయించుకుంటే చాలా మంచిది. చాలామందిలో డెంటిస్ట్ దగ్గరికి వెళ్లినప్పుడు ఈ సమస్యలు బయటపడుతూ ఉంటాయి. అందుకనే నోటి ఆరోగ్యం గురించి తెలుసుకోవడం తప్పనిసరి. అందరూ అవగాహన పెంపొందించుకోవడం చాలా ముఖ్యం.
డాక్టర్ మోహనవంశీ
చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్,
ఒమేగా హాస్పిటల్స్, హైదరాబాద్
98480 11421