సినిమా హీరోలా స్టెప్పులేయాలని ఉందా? అందమైన మూమెంట్స్‌తో సోషల్ మీడియాలో రీల్స్ చేయాలని అనుకుంటున్నారా? కానీ.. ఎక్కడికి వెళ్లాలో, ఎవరి దగ్గర నేర్చుకోవాలో అర్థం కావడం లేదా? డ్యాన్స్ క్లాసుల ఫీజులు చూసి భయపడుతున్నారా? అయితే.. మీకోసం ఓ ‘స్మార్ట్’ మాస్టర్ వచ్చేశాడు. మరెవరో కాదు. మీ ఫోనే! యస్.. మీ జేబులోని స్మార్ట్ ఫోనే ఇప్పుడు ఒక డ్యాన్స్ స్టూడియోలా మారిపోబోతున్నది. కేవలం ఓ యాప్‌తో ప్రొఫెషనల్ డ్యాన్సర్లాగా మీరు కూడా అదిరిపోయే స్టెప్పులు వేసే అవకాశం అందిస్తున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్యాన్స్ లోకంలో తెచ్చిన ఆ మార్పులు కొన్ని చూద్దాం.
డ్యాన్స్ నేర్చుకోవాలంటే పక్కన ఎవరో ఒకరు ఉండి మన తప్పులను సరిదిద్దాలి. కానీ ‘డాన్సియో’ (Dancio) లాంటి సరికొత్త ఏఐ యాప్స్ ఈ లోటును తీర్చేస్తున్నాయి. మీరు చేయాల్సిందల్లా ఫోన్ కెమెరా ముందు నిలబడి స్టెప్పులేయడమే!
మోషన్ అనాలిసిస్: మీరు వేసే ప్రతి అడుగును, స్టెప్పునూ ఏఐ నిశితంగా గమనిస్తుంది. మీ పోశ్చర్ సరిగ్గా ఉందా? మ్యూజిక్ బీట్‌కి తగ్గట్టుగా టైమింగ్ కుదురుతున్నదా? అనేది విశ్లేషించి.. రియల్ టైమ్‌లో ఫీడ్‌బ్యాక్ ఇస్తుంది. అంటే మీ తప్పులను అప్పటికప్పుడు సరిదిద్దుకోవచ్చన్నమాట.
ఏ స్టయిల్ కావాలన్నా: మీకు హిప్-హాప్ అంటే ఇష్టమా? కే-పాప్పై పిచ్చి ఉందా? ఏ స్టయిల్ అయినా సరే, వరల్డ్ క్లాస్ ఎడ్యుకేటర్స్ రూపొందించిన లెసన్స్ ఇక్కడ సిద్ధంగా ఉంటాయి.
డ్యాన్స్ నేర్చుకోవడమే కాదు.. సొంతంగా కొత్త స్టెప్పులను సృష్టించాలనుకుంటున్నారా? అయితే ‘freebeat.ai’ లాంటి టూల్స్ మీకోసం మ్యాజిక్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. మీరు ఇచ్చే మ్యూజిక్ టెంపోను, స్టయిల్‌ను బట్టి పూర్తి డాన్స్ రొటీన్‌ను జనరేట్ చేస్తుంది. స్టేజ్ షోలు ఇచ్చేవారికి, కొత్తగా రీల్స్ క్రియేట్ చేసేవారికి ఇది ఒక గొప్ప వరమనే చెప్పాలి.
ప్రైవసీ: పదిమందిలో స్టెప్పులేయడానికి బిడియం పడేవారికి, ఇంట్లోనే హాయిగా ప్రాక్టీస్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
రిపోర్ట్స్: మీ డ్యాన్స్ రోజురోజుకూ ఎలా మెరుగుపడుతుందో గ్రాఫ్‌ల రూపంలో, రిపోర్ట్స్ రూపంలో చూసుకోవచ్చు.
ఖర్చు తక్కువ: ప్రొఫెషనల్ స్టూడియోల ఖర్చుతో పోలిస్తే.. ఇవి చాలా చవక.
బెస్ట్ కంపానియన్ : విప్లవాత్మకమైన రీతిలో ఏఐ మన జీవితంలోకి వచ్చేస్తున్నది. మనతో కలిసి అడుగేస్తున్నది. ఇప్పుడు అది మన డ్యాన్స్ స్టెప్పులను కూడా సరిదిద్దుతున్నది. డ్యాన్సర్‌గా ఎదగాలన్న మీ కలకు.. ఈ ఏఐ టూల్స్ కొండంత సపోర్ట్ అందిస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? మీ ఫోన్ తీయండి.. ఏఐతో కలిసి స్టెప్పులేయండి!