మందారంతో జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. పెరట్లో పూసే మందార పూలు కేశ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తాయి. మందార నూనె జుట్టును నల్లగా మార్చడమే కాదు, తెల్ల జుట్టు రాకుండా అరికడుతుంది. దీనికోసం వందలు, వేలు ఖర్చు పెట్టాల్సిన పన్లేదు. మందార తైలం తయారీ చాలా సులభం. ఈ పూలను స్వచ్ఛమైన కొబ్బరినూనెలో వేసి సన్నని మంట మీద ఐదారు నిమిషాలపాటు మరిగించాలి. చల్లారాక డబ్బాలోకి తీసుకుని, వారానికి రెండుసార్లు మాడుకు, జుట్టుకు పట్టించి తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇంట్లోనే చెట్టు ఉంటే మందార ఆకులను కూడా నూనెలో మరిగించుకుని వాడొచ్చు. అంతేకాదు, వేడి నూనెలో పూలను కొద్దిసేపు నానబెట్టినా, సారమంతా అందులో ఇంకుతుంది. ఇలా నూనెతోపాటు మందార పూలగుజ్జులో తేనె, పెరుగు కలుపుకొని హెయిర్ ప్యాక్ వేసుకున్నా జుట్టు నిగనిగలాడుతుంది.